Homeఆంధ్రప్రదేశ్‌Telangana Para Olympics Winner: తెలంగాణ ఆణిముత్యం దీప్తి జీవాంజీ అరుదైన ఘనత.. అందులో మెడల్...

Telangana Para Olympics Winner: తెలంగాణ ఆణిముత్యం దీప్తి జీవాంజీ అరుదైన ఘనత.. అందులో మెడల్ సాధిస్తే తిరుగులేదు

Telangana Para Olympics Winner: ఆమె పుట్టినప్పుడు బంధువులు చులకన చేసి మాట్లాడారు. ఎదుగుతుంటే తోటి స్నేహితులు ఈసడించుకున్నారు. సమాజంలో మనుషులు ఆమెను దూరం చేశారు. ఇలా ప్రతి సందర్భంలో ఆమెకు ఇటువంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయి. ప్రతి అనుభవం నుంచి ఆమె పాఠం నేర్చుకుంది. దానిని గెలుపు పాఠం గా మార్చుకుంది. జీవిత ప్రయాణంలో అనేక ఆటు పోట్లు ఎదుర్కొంది. చివరికి ప్రపంచ వేదిక మీద విజేతగా నిలిచింది. నిలవడం మాత్రమే కాదు తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న ఆశలను నిజం చేసి చూపించింది. తద్వారా శారీరక లోపం అనేది దేనికీ అడ్డంకి కాదని నిరూపించింది. ఆమె దీప్తి జీవాంజి.

ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ లో జన్మించిన దీప్తి జీవాంజీ.. మరో అరుదైన ఘనత సాధించింది. ఇటీవల పారా ఒలంపిక్స్ లో కాంస్యం సాధించిన ఆమె.. ఇప్పుడు మరో చారిత్రాత్మక ప్రదర్శనకు సిద్ధమైంది. దీంతో తెలంగాణ కీర్తి పతాక మరోసారి ప్రపంచ స్థాయిలో ఎగరనుంది. ఇప్పటికే దీప్తి పారిస్ ప్రాంతంలో జరిగిన పారా ఒలంపిక్స్ పోటీలో కాంస్యం సాధించింది. కాంస్యం సాధించిన తర్వాత దీప్తి పేరు మరింత మారుమోగిపోయింది. ఆమెపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే తన మీద పెరిగిన అంచనాలను మరింత బలోపేతం చేసుకోవడానికి దీప్తి అడుగులు వేస్తోంది. ఇందులో బాగానే మైదానంలో తీవ్రంగా శ్రమిస్తోంది.. తన పరుగును మరింత రాటు తేల్చుకుంటున్నది.

Also Read: ప్రెస్ కాన్ఫరెన్స్ లో భార్య కాల్ చేసింది.. లిఫ్ట్ చేయలేమంటూ నవ్వులు పూయించిన బూమ్రా

పర్వతగిరి మండలంలోని కల్లెడ ప్రాంతంలో పుట్టిన దీప్తికి చిన్నప్పటి నుంచి పరుగులు తీయడం అంటే చాలా ఇష్టం ఉండేది. చివరికి దానిని ఆమె కెరీర్ గా మార్చుకుంది. మైదానంలో జింకపిల్ల మాదిరిగా పరుగులు పెట్టేది. తన పేదరికం అడ్డుగా ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా లక్ష్యం వైపు దూసుకుపోయింది. ఇదే క్రమంలో ఆమెకు మెరుగైన శిక్షణ ఇప్పించడానికి తండ్రి ఏకంగా తనకు ఉన్న భూమిని విక్రయించాడు. భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్నను వేసుకోకుండా.. ఆమె కోసం తపనపడ్డాడు. ప్రపంచ స్థాయిలో శిక్షణ ఇప్పించాడు. తండ్రి తనకోసం చేస్తున్న త్యాగాన్ని దీప్తి ప్రతిక్షణం గుర్తు పెట్టుకునేది. చివరికి పరుగుల రారాణి అయింది. ఏకంగా పారిస్ వేదికగా జరిగిన పారా ఒలంపిక్స్ పోటీలో కాంస్యం దక్కించుకుంది. ఆమె ప్రతిభను చూసి మెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు బహుమతి అందించింది. కేంద్రం కూడా ఆమెకు అర్జున పురస్కారం అందించింది.

పారా ఒలంపిక్స్ పోటీలో కాంస్యం దక్కించుకున్న దీప్తి.. ఆ తర్వాత తన ప్రతిభకు మరింత పదును పెట్టుకుంది. ఇటీవల బెంగళూరులోని కంటే రామ్ మైదానంలో జరిగిన వరల్డ్ పారా ఛాంపియన్ ఎంపిక పోటీలలో ఆమె పాల్గొన్నది. 400 మీటర్ల పరుగు పందెంలో 56.06 సెకండ్ల వ్యవధిలో ఆమె తన లక్ష్యాన్ని పూర్తిచేసుకుంది. అంతేకాదు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని అందుకుంది. దీంతో దీప్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రపంచ పోటీల్లో బంగారు పతకం సాధించాలని.. ప్రపంచ వేదిక మీద తెలంగాణ, భారత కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడించాలని అభిమానులు కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular