Lok Sabha Deputy Speaker: టిడిపి యువ ఎంపీకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్?

ఎన్డీఏ లో బిజెపి తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం. ఈ ఎన్నికల్లో 240 పార్లమెంటు స్థానాలను బిజెపి గెలుచుకుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన స్థానాలను దక్కించుకోలేదు.

Written By: Dharma, Updated On : June 28, 2024 4:52 pm

Lok Sabha Deputy Speaker

Follow us on

Lok Sabha Deputy Speaker: లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి ఇస్తారు? 2019 మాదిరిగా ఖాళీగా ఉంచుతారా? లేకుంటే భాగస్వామ్య పార్టీకి కేటాయిస్తారా? కేటాయిస్తే ఏ పార్టీకి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. జాతీయ మీడియాలో సైతం ఇదే ప్రధాన వార్తగా మారింది. లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికైన సంగతి తెలిసిందే. రెండోసారి ఆయన ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పోస్టు ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గతసారి ఏకపక్షంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ గెలవడంతో ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కేటాయించలేదు. ఈసారి కూడా ససేమిరా అనడంతో విపక్షాలన్నీ స్పీకర్ అభ్యర్థిని ఎంపిక చేశాయి. కానీ మూజువాణి ఓటుతో బిజెపి అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈ తరుణంలో డిప్యూటీ స్పీకర్ పోస్టును భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఏదో ఒక పార్టీకి కేటాయించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎన్డీఏ లో బిజెపి తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం. ఈ ఎన్నికల్లో 240 పార్లమెంటు స్థానాలను బిజెపి గెలుచుకుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన స్థానాలను దక్కించుకోలేదు. ఈ తరుణంలోనే తెలుగుదేశం పార్టీ 16, జెడియు 12 గెలుచుకోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. అందుకే ఆ రెండు భాగస్వామ్య పార్టీల్లో ఏదో ఒక దానికి డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి కేంద్ర క్యాబినెట్లో చోటిచ్చారు. రెండు మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆ పార్టీకి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని.. పదవులు వద్దని ఇప్పటికే చంద్రబాబు కేంద్ర పెద్దలను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ తీసుకుంటుందో? లేదో? చూడాలి.

అయితే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ను తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో లోక్సభ స్పీకర్ గా టిడిపి ఎంపీ జిఎంసి బాలయోగి వ్యవహరించిన సంగతి తెలిసిందే. నాడు ఎన్డీఏలో టిడిపి క్రియాశీలకంగా ఉండేది. అనూహ్యంగా ఆ పార్టీకి స్పీకర్ పోస్టు దక్కింది. ఇప్పుడు అదే బాలయోగి కుమారుడు హరీష్ అమలాపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. విద్యాధికుడు కూడా. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హరీష్ ను డిప్యూటీ స్పీకర్ చేస్తే మంచి సంకేతాలు పంపించినట్లు అవుతుందని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రధాని మోదీ, చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.