Inzamam-ul-Haq: టి20 వరల్డ్ కప్ లో దాదాపు దశాబ్దం తర్వాత టీమిండియా ఫైనల్ వెళ్ళింది. గురువారం గయానా వేదికగా జరిగిన రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బట్లర్.. ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపాడు. భారత జట్టును ముందుగా బ్యాటింగ్ చేయాలని ఆహ్వానించాడు. వర్షం వల్ల మైదానం చిత్తడిగా మారడంతో.. ఆట కాస్త ఆలస్యంగా మొదలైంది. అయినప్పటికీ టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శివం దూబే విఫలమైనప్పటికీ.. రోహిత్ శర్మ 57, సూర్య కుమార్ యాదవ్ 47, హార్థిక్ పాండ్యా 23, రవీంద్ర జడేజా 17 దూకుడుగా ఆడటంతో నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు.. 16.4 ఓవర్లలో 103 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ జట్టులో బ్రూక్ 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కులదీప్ యాదవ్, అక్షర పటేల్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో టీమిండియా దాదాపు దశాబ్దం తర్వాత టి20 వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్ళింది. టీమిండియా ఫైనల్ వెళ్లడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా భారత జట్టు భారత జట్టు ఆటగాళ్లను కీర్తిస్తూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.. వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో.. టి20 వరల్డ్ కప్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టీమిండియా ఫైనల్ వెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ మరోసారి తన అక్కసును వెళ్ళగక్కాడు. ” టి20 వరల్డ్ కప్ లో అన్ని జట్లకు ఒకే రూల్స్ ఉంటాయి. భారత జట్టుకు మాత్రం అవి ప్రత్యేకంగా ఉంటాయి. రెండవ సెమీఫైనల్ చూస్తేనే అది స్పష్టంగా అర్థమవుతోంది. ఇండియా vs ఇంగ్లాండ్ గేమ్ కు మాత్రమే రిజర్వ్ డే లేదు. పైగా టోర్నీ ప్రారంభానికి ముందే సెమిస్ వేదిక ఖరారు చేశారు. రిజర్వ్ డే లేకపోవడంతో వర్షం కురిసినా టీమిండియా నేరుగా ఫైనల్ వెళ్లేలాగా చూసుకున్నారు.. ప్రపంచ క్రికెట్ ను భారత క్రికెట్ కౌన్సిల్ శాసిస్తోందని” ఇంజమామ్ ఆరోపించాడు.
సూపర్ -8 లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించినప్పుడు కూడా అతడు ఇదే విధంగా మాట్లాడాడు. ముఖ్యంగా అర్ష్ దీప్ సింగ్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడని ఆరోపించాడు. టీమిండియా ఆస్ట్రేలియాను మోసం చేసి గెలిచిందని మండిపడ్డాడు. ఇంజమామ్ వ్యాఖ్యల నేపథ్యంలో.. టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. “వయసు పెరుగుతున్నా కొద్దీ ఇంజమామ్ కు బుద్ధి క్షీణిస్తోంది. తలకాయలో గుజ్జు మొత్తం కరిగిపోయింది. అందువల్లే ఏదేదో వాగుతున్నాడు. ఐసీసీలో అన్ని జట్లకు ప్రమేయం ఉంటుంది. షెడ్యూల్ మొత్తం అన్ని జట్లకు ఆమోదయోగ్యంగా మారిన తర్వాతే ఓకే చేస్తారు. ఒక జట్టు కోసం షెడ్యూల్ రూపొందించరు. పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ఇంజమామ్ ఇలా చవకబారు వ్యాఖ్యలు చేసి పరువు తీసుకోవద్దని” టీమిండియా అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ” ముందు మీ పాకిస్తాన్ జట్టును బాగు చేసుకోండి. టీమిండియా మీద తర్వాత ఏడుద్దురుగాని” అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.