India Vs South Africa Final: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా : మా గాంధీ తాతను ట్రైన్ నుంచి గెంటేశారు.. మిమ్మల్ని వదలం?

శనివారం అంటిగ్వా వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తో టీమిండియా తలపడనుంది. దాదాపు దశాబ్దం తర్వాత టీమ్ ఇండియా ఫైనల్ వెళ్లడంతో సోషల్ మీడియాలో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 28, 2024 5:07 pm

India Vs South Africa Final

Follow us on

India Vs South Africa Final: దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్లో ఎంట్రీ ఇచ్చింది.. వాస్తవానికి గత టి20 వరల్డ్ కప్ లో అడిలైడ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో దారుణమైన ఓటమి ఎదురుకాకుంటే.. టీమిండియా ఫైనల్ వెళ్లేదే. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు బట్లర్, హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడటంతో టీమిండియా దారుణమైన ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.. ఇక వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోనూ భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో ఎలాగైనా టి20 వరల్డ్ కప్ దక్కించుకోవాలనే కసి ఆటగాళ్లల్లో పెరిగిపోయింది. అందుకే ఈ టి20 వరల్డ్ కప్ లో ప్రతీకారాలు తీర్చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ దూరం చేసిన ఆస్ట్రేలియాపై సూపర్ -8 మ్యాచ్ లో టీం ఇండియా గెలిచింది. ఇక గత టి20 వరల్డ్ కప్ లో పది వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ జట్టును సెమీఫైనల్ -2 మ్యాచ్లో 68 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. ఈ గెలుపుతో దర్జాగా ఫైనల్ చేరుకుంది.

శనివారం అంటిగ్వా వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తో టీమిండియా తలపడనుంది. దాదాపు దశాబ్దం తర్వాత టీమ్ ఇండియా ఫైనల్ వెళ్లడంతో సోషల్ మీడియాలో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ రూపొందించి నవ్వులు పూయిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దక్షిణాఫ్రికా జట్టుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. “ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా జట్లపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. దక్షిణాఫ్రికాపై కూడా ప్రతీకారం మిగిలే ఉంది. గతంలో మీ దేశానికి వచ్చిన మహాత్మా గాంధీని అవమానించారు కదా.. ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది.. మా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపితను మీరు ట్రైన్లో నుంచి గెంటేశారు. అలాంటి మిమ్మల్ని ఎందుకు వదిలి పెట్టాలి” అంటూ నెటిజన్లు రూపొందించిన మీమ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఇది మిలియన్ వ్యూస్ నమోదు చేసింది.

ఇక ఈ టి20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా కూడా భారత జట్టు మాదిరే వరుస విజయాలు సాధించింది. బలమైన ఇంగ్లాండ్, వెస్టిండీస్ వంటి జట్లను మట్టికరిపించి ఫైనల్ దూసుకొచ్చింది. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై ఏకపక్ష విజయ సాధించి.. సరికొత్త రికార్డు సృష్టించింది.. తొలిసారి t20 వరల్డ్ కప్ ఫైనల్ కు వచ్చిన జట్టు.. కప్ దక్కించుకోవాలని ఆశపడుతోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో రెండు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే శనివారం హోరాహోరి మ్యాచ్ తప్పదనిపిస్తోంది.