Chandrababu : విభజిత హామీల అమలుపై పార్లమెంట్ లో గట్టిగా పోరాడాలని టీడీపీ నిర్ణయించింది. నాలుగేళ్ల వైసీపీ పాలనలో అన్నింటా వైఫల్యం చెందిందని ఆరోపిస్తోంది. రాష్ట్రంలో విధ్వంసక పాలన, గాడి తప్పి లా అండ్ ఆర్డర్ పై పార్లమెంట్ లో గళమెత్తనుంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా వైసీపీ వైఫల్యాలను ఎండగట్టి.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏపీ సమస్యలు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే ఈసారి గట్టి స్టాండే తీసుకున్నారు. ఎన్నికలకు పట్టుమని పది నెలలు లేకపోవడంతో ఈ సమావేశాలను రాజకీయంగా వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది.
విభజిత హామీలను సాధించడంలో జగన్ సర్కారు వైఫల్యం చెందిందని భావిస్తోంది. అందుకే జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టాలని వ్యూహ రచన చేస్తోంది. ప్రస్తుతం లోక్ సభలో టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని ఉన్నారు. రామ్మోహన్ నాయుడు, జయదేవ్ లు గట్టిగానే వాయిస్ వినిపిస్తారు. అయితే ఇటీవల జయదేవ్ సైలెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలిచ్చారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం వంటి శాశ్వత ప్రాజెక్టుల విషయంలో వైసీపీ సర్కారు వైఫల్యాలపై గళమెత్తాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు.
నాలుగేళ్ల వైసీపీ పాలనలో అన్నింటా వైఫల్యాలే కనిపిస్తున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. 10 ఏళ్ల రాష్ట్ర విభజన చట్ట కాలపరిమితి మరి కొద్ది నెలల్లో ముగుస్తున్నా…వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర హక్కులు కాపాడ లేకపోయిందని గుర్తుచేశారు. 31 మంది ఎంపిలు ఉండి కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వైసీపీ ఉందన్నారు. ప్రత్యేక హోదా తెస్తానని ఊరూరా తిరిగి ఓట్లు వేయించుకున్న జగన్ ఆ పని చేయకపోగా.. ఒక్క ప్రాజెక్టును కూడా సాధించలేకపోయిందన్నారు. విశాఖ రైల్వే జోన్, మెట్రో, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది నిధులు సహా ఏ ఒక్క ప్రాజెక్టు విషయంలో వైసీపీ పురోగతి సాధించలేకపోయిందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో పూర్తిగా గాడి తప్పిన లా అండ్ ఆర్డర్, విధ్వంసక పాలనపై పార్లమెంట్ లో మాట్లాడాలని చంద్రబాబు నాయుడు ఎంపిలకు సూచించారు.
గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కేశినేని నాని, గల్లా జయదేవ్ లు సమావేశానికి హాజరుకావడం విశేషం. ప్రధానంగా ఈరోజు బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ మిత్రపక్షాల సమావేశం చర్చకు వచ్చింది. అటు రేపు జరగబోయే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి పవన్ హాజరవుతుండడం, టీడీపీకి ఆహ్వానం లేకపోవడం వంటి వాటిపై చర్చించారు. ప్రస్తుతం టీడీపీ తటస్థంగా ఉండడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రేపటి ఎన్నికల్లో పార్టీ కి ఏది ప్రయోజనకరమో.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తామని చంద్రబాబు ఎంపీలకు సంకేతాలిచ్చారు. సమావేశంలో కనకమేడల రవీంద్ర కుమార్, కంభంపాటి రామ్మోహన్ రావు పాల్గొన్నారు.