TDP MP : ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) కేంద్రం వద్ద ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది. రాజకీయంగా, ఆర్థికంగా బిజెపి పెద్దలు తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. అటు ఏపీ క్యాబినెట్లో కూడా బిజెపి ప్రాతినిధ్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ చైర్మన్ గా ఆయన నియమితులయ్యారు. ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తారు. రైతుల సంక్షేమానికి, పారదర్శక ధాన్యం సేకరణ బాధ్యతలను లావు శ్రీకృష్ణదేవరాయలు చూడనున్నారు. ఆయన నియామకం పై టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారు. లోక్ సభలో టిడిపి వాయిస్ ను గట్టిగానే వినిపిస్తున్నారు. అటువంటి నేతకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం.
* ఎఫ్ సి ఐ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ చైర్మన్ గా..
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( Food Corporation of India) ప్రతి రాష్ట్రాలకు బాధ్యులను నియమిస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్ గా లావు శ్రీకృష్ణదేవరాయలను నియమించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇకనుంచి ఏపీకి సంబంధించిన ఆహార ధాన్యాల సేకరణతో పాటు ఆహార ధాన్యాల నిల్వ, పంపిణీ వంటి అంశాలను చూసే ఎఫ్సీఐ కమిటీకి నేతృత్వం వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తారు. ధాన్యం సేకరణ ప్రక్రియ, ఇతర పంట ఉత్పత్తుల సేకరణతో పాటుగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు అమలవుతున్న తీరును పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో ఆహార భద్రతకు సంబంధించి కేంద్రానికి సూచనలు, సిఫారసులు కూడా చేస్తారు.
Also Read : టిడిపి ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో ట్విస్ట్
* ఎన్నికలకు ముందు టిడిపిలోకి..
2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చేరారు లావు శ్రీకృష్ణదేవరాయలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2019 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే ఈ ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మరోసారి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ పై విజయం సాధించారు. మరోవైపు లావు శ్రీకృష్ణదేవరాయలను టిడిపి పార్లమెంటరీ నేతగా నియమించారు చంద్రబాబు. తాజాగా ఎఫ్ సి ఐ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.