TDP MP Candidates : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా ప్రకటనకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 17 మంది ఎంపీ అభ్యర్థులతో పాటు 16 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీనిపై కసరత్తు పూర్తి చేశారు. ఈరోజు రాత్రికి కానీ.. రేపు కానీ అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే 11మంది ఎంపీ అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన వాటిపై సైతం జోరుగా కసరత్తు చేస్తున్నారు.
టిడిపి, జనసేన, బిజెపి మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. మిగతా 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాల్లో టిడిపి పోటీ చేయనుంది. అయితే ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలను ఖరారు చేయడంతో.. కేవలం 16 స్థానాలే మిగిలాయి. మరోవైపు 17 పార్లమెంటు స్థానాల్లో 11 స్థానాలు విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇలా ఒక నిర్ణయానికి వచ్చిన స్థానాల విషయాన్ని ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ రాత్రికి కానీ, రేపు ఉదయం కానీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని తెలుస్తోంది. బిజెపికి కేటాయించిన కొన్ని ఎంపీ నియోజకవర్గాల్లో మార్పులు చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ఎంపి సీట్లను పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది.
11 మంది ఎంపీ అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చినట్లు సమాచారం. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం నుంచి ఎం భరత్, అమలాపురం నుంచి గంటి హరీష్, విజయవాడ నుంచి కేశినేని చిన్ని, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాద్, అనంతపురం బి.కె పార్థసారథి, నంద్యాల బైరెడ్డి శబరి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ జాబితా ఈరోజు రాత్రికి కానీ.. రేపు ఉదయం కానీ ప్రకటించే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.