TDP Master Sketch: కడప( Kadapa ) జిల్లాలో ఫ్యాన్ ముక్కలవుతోందా? వైయస్సార్ కుటుంబ హవా తగ్గుతోందా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప అంటే ముందుగా గుర్తొచ్చేది వైయస్సార్. రాజకీయంగా మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. కడప జిల్లా అనేసరికి వైయస్ కుటుంబ అభిమానులు ఎక్కువగా ఉండేవారు. అందుకే అక్కడ రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. తరువాత జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. కానీ మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. అప్పటివరకు బలంగా కనిపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమేపి బలహీనపడడం ప్రారంభించింది. ఇప్పుడు ప్రత్యర్ధులు సవాల్ విసిరుతుండడంతో కనీసం సమాధానం చెప్పేవారు కూడా కడపలో కరువవుతున్నారు.
* వైయస్సార్ కుటుంబ హవా..
అధికారంతో సంబంధం లేకుండానే కడప జిల్లాలో వైయస్సార్ కుటుంబ( YSR family) హవా నడిచేది. కాంగ్రెస్ పార్టీని విభేదించి కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు ఐదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తిరుగులేని విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. కూటమి ప్రభంజనం సృష్టించింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడింట విజయం సాధించింది. అయితే ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ కష్టాలు ప్రారంభమయ్యాయి. అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా అన్ని నియోజకవర్గాల్లో టిడిపి కూటమి పట్టు బిగించడం ప్రారంభించింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మౌనం దాల్చుతున్నారు. మరికొందరైతే పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
* అంతటా విభేదాల పర్వం..
అధికారంలో ఉన్నన్నాళ్లు విభేదాలు కనిపించలేదు కానీ.. ఎప్పుడైతే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఓటమి ఎదురైందో.. అప్పటినుంచి అన్ని నియోజకవర్గాల్లో విభేదాలు బయటపడ్డాయి. సహజంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇక్కడ బలంగా ఉంది. కానీ ఆ పార్టీ ద్వారా పదవులు దక్కించుకున్న వారు మాత్రం గుడ్ బై చెబుతున్నారు. దీంతో పార్టీ శ్రేణులను సమన్వయం చేసేవారు కరువవుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పదవులకు ఇటీవల రాజీనామా చేశారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం. కేవలం పార్టీలో తలెత్తిన విభేదాలతోనే దూరమయ్యారు. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర సైతం పార్టీకి రాజీనామా చేశారు. కడపలో ఒకేసారి ఎనిమిది మంది కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఉంది.
* పది నియోజకవర్గాల నుంచి..
ఈనెల 27 నుంచి కడపలో మహానాడు( mahanadu) జరగనుంది. ఈ వేదికపై కడప ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ టిడిపిలో చేరే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు అన్నిచోట్ల నేతలతో రాయబారాలు నడుస్తున్నాయి. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం. అయితే మహానాడు దృష్ట్యా చాలామంది పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనతో ఉన్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సమాచారం ఉంది. కానీ ఎటువంటి చర్యలకు దిగకపోవడం విశేషం.