BJP TDP Alliance: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. గెలుపొందేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వైసిపి రెండోసారి విజయం కోసం గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని టిడిపి భావిస్తోంది. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకుంది. దీంతో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం ఒక కొలిక్కి వచ్చింది. అయితే జనసేనతో పొత్తులో భాగంగా టిడిపి నేతలు కొన్ని స్థానాలను త్యాగం చేయాల్సి ఉంది. ఇప్పుడు బిజెపి సైతం పొత్తులో భాగంగా కలిసి రావడంతో మరికొన్ని అదనపు సీట్లు టిడిపి వదులుకోవాల్సి వస్తోంది. అదే జరిగితే చాలామంది టిడిపి నేతల భవితవ్యం ఏంటన్నది తెలియాల్సి ఉంది.
గత ఐదు సంవత్సరాలుగా టిడిపి ఇన్చార్జులు, కీలక నేతలు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. పార్టీ కార్యాలయాలను ప్రారంభించి ప్రభుత్వ విధానాలపై పోరాడిన వారు ఉన్నారు. అధికార పార్టీ నుంచి కేసులు ఎదురుకావడం, పార్టీ శ్రేణులను సమన్వయ పరుచుకోవడానికి భారీగా ఖర్చు చేశారు. కీలక నాయకుల పర్యటనల సమయంలో సైతం చేతి చమురు వదిలించుకున్నారు. వారంతా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్లు దక్కుతాయని బలంగా నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు పొత్తుల్లో భాగంగా కీలక స్థానాలు వదులుకోవాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు. పొత్తులో భాగంగా తమ సీట్ల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని అధినేత చంద్రబాబుకు సూచిస్తున్నారు.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. బిజెపి అగ్రనేతలతో సమావేశమయ్యారు. పొత్తులపై సానుకూల సంకేతాలు ఇచ్చారు. అటు బిజెపి నుంచి సైతం సీట్ల ప్రతిపాదన వచ్చింది. కానీ దీనిపై చంద్రబాబు నోరు మెదపడం లేదు. రాష్ట్రం కోసం పొత్తు అనివార్యమని మాత్రం చెబుతున్నారు. దీంతో టీడీపీ నేతల గుండెల్లో గుబులు పుడుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు, బిజెపికి ఎన్ని సీట్లు త్యాగం చేసే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. చంద్రబాబు మాత్రం 40 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వారు 55 నుంచి 60 ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఇంత పెద్ద ఎత్తులో సీట్లు ఇస్తే తమ పరిస్థితి ఏంటని చాలామంది నేతలు ఆందోళన చెందుతున్నారు. తమకు టిక్కెట్ వస్తుందో లేదో అన్న బెంగ వారిని వెంటాడుతోంది.
జనసేనతో పొత్తు వరకు ఓకే కానీ.. బిజెపి విషయంలో పునరాలోచించుకోవాలని టిడిపి నుంచి ఒక రకమైన డిమాండ్ వస్తోంది. బిజెపితో కలిసి వెళ్లడం వల్ల సీట్లు కోల్పోవడంతో పాటు.. మైనారిటీ ఓట్లు దూరమయ్యే అవకాశం ఉందని టిడిపి నేతలు చెబుతున్నారు. అయితే కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి రానుందన్న సంకేతాలతో చంద్రబాబు పొత్తువైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ పొత్తు ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.