https://oktelugu.com/

Khanapur: నడిరోడ్డుపై యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం

అలేఖ్య హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని నిర్మల్‌ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఒకే కాలనీకి చెందిన ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 9, 2024 / 09:20 AM IST

    Khanapur

    Follow us on

    Khanapur: ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలైంది. పట్టపగలే ఓ యువతిని గొడ్డలితో నరికి చంపాడు. అడ్డుకోబోయిన మరో యువతి, మూడేళ్ల బాలుడిపైనా దాడి చేశాడు. ఈ విషాద ఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో గురువారం(ఫిబ్రవరి 8న)జరిగింది. ఖానాపూర్‌ పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌ కాలనీకి చెందిన షెట్పెల్లి గంగవ్వ–గంగారాం దంపతుల కూతురు అలేఖ్య(23), కోడలు జయశీల, మనుమడు రియాన్స్‌తో కలిసి గురువారం ఉదయం పట్టణంలోని టైలరింగ్‌ శిక్షణకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తుండగా అదే కాలనీకి చెందిన యువకుడు జూకింది శ్రీకాంత్‌ వారిని వెంబడించాడు. దిలావర్‌పూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపైకి రాగానే పదునైన ఆయుధంతో అలేఖ్యపై దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలింది. తర్వాత అందరూ చూస్తుండగానే నరికి చంపాడు. అడ్డకోబోయిన అలేఖ్య వదిన జయశీల, ఆమె కుమారుడు రియాన్స్‌పైనా దాడి చేశాడు. అలేఖ్య అక్కడిక్కడే మృతిచెందింది. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

    ప్రేమ వ్యవహారమే కారణం..
    అలేఖ్య హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని నిర్మల్‌ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఒకే కాలనీకి చెందిన ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో గతంలోనే అమ్మాయి కుటుంబీకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శ్రీకాంత్‌ తమ కూతురును వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయమై పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టామన్నారు. అలేఖ్య హత్యపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క నిర్మల్‌ డీఎస్పీ గంగారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు.