AP Elections 2024
AP Elections 2024: టిడిపి కూటమిలో బిజెపి ఉందా? పొత్తు ధర్మాన్ని పాటిస్తోందా? లేకుంటే ఏపీ రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. కేంద్రంలో మూడోసారి ముచ్చటగా అధికారంలోకి రానున్న బిజెపి… యావత్ భారతదేశం లో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వై నాట్ 400 సీట్లు అంటూ సౌండ్ చేస్తోంది. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఒక్కో రాష్ట్రాన్ని కమలవనంలా మార్చుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన ఓటమిలో భాగస్వామ్యం అయ్యింది.
అయితే ఏపీ విషయంలో బిజెపి అంతరంగం అంతు పట్టడం లేదు. చివరకు మిత్రపక్షాలైన టిడిపి, జనసేన సైతం అయోమయంలో ఉన్నాయి.అటు వైసిపి ప్రయోజనాలు కాపాడుతూనే.. ఇటు మిత్రపక్షలతో పొత్తు కుదుర్చుకోవడం వెనుక రాజకీయ క్రీడ కనిపిస్తోంది. ఒకసారి కూటమి పార్టీలకు చేయూతగా నిలుస్తోంది. మరోసారి అధికార పార్టీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటుంది.అసలు బిజెపి వ్యూహం తెలియక ఆ రెండు పార్టీలు తెగ ఇబ్బంది పడుతున్నాయి.
వాస్తవానికి బిజెపి కోసం జనసేన చాలా రకాలుగా త్యాగాలు చేసింది. తన సీట్లను కూడా వదులుకుంది. పొత్తు ధర్మం కోసమే తాను ఈ త్యాగం చేసినట్లు స్పష్టం చేసింది. అటువంటి జనసేన ఇప్పుడు కష్టాల్లో ఉంటే బిజెపి పట్టించుకోవడం లేదు. జనసేన గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్ లకు కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గుర్తును కామన్ సింబల్ గా మార్చాలని జనసేన రెండుసార్లు ఎలక్షన్ కమిషన్ ను కోరింది.సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించినా.. నామినేషన్ల ఉపసంహరణ నాడు ఇండిపెండెంట్ లకు ఆ గుర్తును కేటాయించి షాక్ కు గురి చేసింది. ఇది సరి చేయాల్సిన బిజెపి ప్రేక్షక పాత్ర పోషించింది. అటువంటప్పుడు పొత్తు ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
బిజెపిపై అనుమానపు చూపుల నేపథ్యంలో.. వైసీపీకి మరో వస్త్రాన్ని అందించింది. టిడిపి కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ మేనిఫెస్టోను ముట్టుకునేందుకు కూడా బిజెపి ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ ఆసక్తి చూపకపోవడం వైరల్ గా మారింది. ఈ మేనిఫెస్టోకు బిజెపి సహకారం ఉందని చంద్రబాబుతో పాటు పవన్ చెప్పుకొచ్చారు. కానీ ఆ మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బిజెపి నేతలు సుముఖత చూపలేదు. దీనినే ఇప్పుడు వైసీపీ ప్రచారం చేస్తోంది. అయితే బిజెపి పాలసీ దృష్ట్యా తాను మేనిఫెస్టోను పట్టుకోలేదని.. కానీ ఏపీకి బిజెపి సంపూర్ణ మద్దతు ఉంటుందని అదే సిద్ధార్థ నాథ్ తో చెప్పించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అయితే బిజెపి వ్యవహార శైలి పై టిడిపి, జనసేన శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.