T20 World Cup 2024: క్రికెట్ సగటు భారతీయుడి ఎమోషన్.. స్టార్ స్పోర్ట్స్ వరల్డ్ కప్ ప్రోమో చూశారా?

రోహిత్ ఆధ్వర్యంలో టి20 వరల్డ్ కప్ ఆడే జట్టును టీమిండియా ప్రకటించిన నేపథ్యంలో.. స్టార్ స్పోర్ట్స్ వరల్డ్ కప్ ప్రోమో ను విడుదల చేసింది. ట్విట్టర్ ఎక్స్ వేదికగా బుధవారం నిమిషాని కంటే తక్కువ నిడివి ఉన్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం అప్లోడ్ చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 1, 2024 2:55 pm

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024:టీమిండియా పాకిస్తాన్ పై గెలిస్తే వీధుల్లోకి వచ్చి డ్యాన్స్ వేస్తారు. జాతీయ జెండాలు ఎగరవేసి సంబరాలు జరుపుకుంటారు. పటాసులు కాల్చి వేడుకలు నిర్వహిస్తారు. అదే ఓడిపోతే.. క్రికెటర్లను ఆడిపోసుకుంటారు. సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తారు. కోపం తారస్థాయికి చేరితే క్రికెటర్ల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఆడినప్పడు నెత్తిన పెట్టుకుంటారు. ఆడనప్పుడు అలా కింద పడేస్తారు. ఇదంతా కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు. మరి కొంతమందికి అతి అనిపించవచ్చు. క్రికెట్ ను ఆరాధించి.. క్రికెటర్లను ఆరాధ్య దేవుళ్ళుగా భావించే భారతీయులకు.. ముఖ్యంగా భారతీయ క్రికెట్ అభిమానులకు అవన్నీ లెక్కలోకి రావు. వారికి కావాల్సింది కేవలం టీమిండియా గెలవడమే. దానికోసం వారు ఏదైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. స్వదేశంలో గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. అప్పట్లో చాలామంది భారతీయ క్రీడాకారులను తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత టెస్ట్ ఛాంపియన్షిప్ లోనూ భారత్ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో సగటు క్రికెట్ అభిమానికి వెలితి ఉంది. ఆ వెలితిని పూడ్చేందుకు ఐసీసీ మరో మెగా ఈవెంట్ తో ముందుకు వచ్చింది. వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ రెండు నుంచి టీ20 వరల్డ్ కప్ ను నిర్వహించనుంది. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ జట్టును కూడా ప్రకటించింది.

రోహిత్ ఆధ్వర్యంలో టి20 వరల్డ్ కప్ ఆడే జట్టును టీమిండియా ప్రకటించిన నేపథ్యంలో.. స్టార్ స్పోర్ట్స్ వరల్డ్ కప్ ప్రోమో ను విడుదల చేసింది. ట్విట్టర్ ఎక్స్ వేదికగా బుధవారం నిమిషాని కంటే తక్కువ నిడివి ఉన్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం అప్లోడ్ చేసింది. అందులో రోహిత్ శర్మ నుంచి మొదలుపెడితే అక్షర్ పటేల్ వరకు కనిపిస్తున్నారు. ఇండియాలో క్రికెట్ ను ఎందుకు అంతలా ఆరాధిస్తారో.. ఆటగాళ్ళను ఎందుకు అంతలా అభిమానిస్తారో.. ఆ వీడియోలో స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం స్పష్టంగా చూపించింది. “కోట్లాది స్వరాలు.. అంతకుమించిన ప్రార్థనలు.. ఈ దేశ ప్రజల ఆశలు.. కలలను 15 మందితో కూడిన బృందం మొసుకెళ్తోంది. మీపై మాకు నమ్మకం ఉంది. ఆ ట్రోఫీని సగర్వంగా ఇంటికి తీసుకురండి” అంటూ స్టార్ స్పోర్ట్స్ ఆ ప్రోమోలో పేర్కొంది.

ఇక గత టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టుపై విరాట్ కోహ్లీ కొట్టిన సిక్సర్.. రోహిత్ శర్మ చేసిన పరుగులు.. రవీంద్ర జడేజా బౌలింగ్.. అక్షర్ పటేల్ తీసిన వికెట్లు.. బుమ్రా సంధించిన యార్కర్లు.. భారత జట్టు అభిమానులు ఎగరేసిన జాతీయ జెండాలు.. వీటన్నింటినీ అద్భుతమైన సమహారంగా స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం చిత్రీకరించింది. మైదానంలో ప్రవేశించే ఆటగాళ్లపై అభిమానులకు ఏ స్థాయిలో ఆశలు ఉంటాయో ఈ వీడియో ప్రస్ఫుటం చేసింది.. జూన్ రెండున ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లను స్ట్రీమింగ్ చేయనుంది.