TDP (2)
TDP: ఏపీలో( Andhra Pradesh) కూటమి ఏకపక్ష విజయం దక్కించుకున్న జిల్లాల్లో విజయనగరం ఒకటి. దాదాపు అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంది కూటమి. బలమైన బొత్స సామ్రాజ్యం కూలిపోయింది. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఓటమి చవిచూశారు. అయితే ఇంతటి విజయాన్ని నిలుపుకోలేని స్థితిలో ఉంది కూటమి. అధికారంలోకి వచ్చిన పది నెలలకే విభేదాల పర్వం మొదలైంది. పతాక స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లిమర్లలో పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి అన్నట్టు పరిస్థితి మారింది. రెండు పార్టీల అధినాయకత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఈ ఇద్దరు నేతలు పట్టించుకోవడం లేదు. దీంతో ఇక్కడ కూటమిలో అడ్డగోలు చీలిక కనిపిస్తోంది.
Also Read: రీల్ హీరో కాదు రియల్ హీరో.. గిరిజనుల మదిని దోచిన పవన్ కళ్యాణ్!
* జనసేనకు కేటాయింపు..
2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా నెల్లిమర్ల( nelli Marla ) నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున లోకం మాధవి పోటీ చేశారు. టిడిపి శ్రేణులు సహకరించడంతో భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాధవి టిడిపి శ్రేణులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శ ఉంది. టిడిపిని కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన వారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తనకంటూ నియోజకవర్గంలో ఒక సొంత క్యాడర్ను తయారు చేసుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. 2019లో కేవలం 5000 ఓట్ల వరకు మాత్రమే తెచ్చుకున్నారు మాధవి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.
* కర్రోతు సారధ్యంలో టిడిపి బలోపేతం..
అయితే గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు నియోజకవర్గ ఇన్చార్జ్ కర్రోతు బంగార్రాజు. తనకే టికెట్ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం బాగానే ఖర్చు పెట్టారు. లోకేష్ పాదయాత్ర ముగింపును తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయించారు. అయితే ఇక్కడ టిడిపికి మాజీమంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు ఉండేవారు. ఆయన వయోభారంతో పక్కకు తప్పుకోవడంతో బంగార్రాజుకు నియోజకవర్గ టిడిపి బాధ్యతలు అప్పగించారు. దీంతో తనకు టికెట్ ఖాయమని భావించిన కర్రోతు బాగానే కష్టపడ్డారు. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించడంతో బాధపడ్డారు. కానీ చంద్రబాబు సముదాయించడంతో జనసేన అభ్యర్థి లోకం మాధవి గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఇప్పుడు అదే కర్రోతును నిర్లక్ష్యం చేస్తున్నారు ఎమ్మెల్యే మాధవి. టిడిపి క్యాడర్ తో పాటు నాయకత్వాన్ని నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. అందుకే ఇక్కడ విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఎత్తుకు పైఎత్తులు అన్నట్టు సాగుతున్నాయి.
* ఇరు పార్టీల శ్రేణుల ఫిర్యాదు..
కూటమి అధికారంలోకి రావడంతో కర్రోతు బంగార్రాజుకు ( bangarraju) రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి దక్కింది. కీలకమైన మార్క్ ఫెడ్ అధ్యక్ష పదవి దక్కడంతో ఆయన సైతం నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో జనసేన ఎమ్మెల్యే మాధవి తో విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఎమ్మెల్యే పాల్గొంటున్న కార్యక్రమానికి కుర్రోతు హాజరు కావడం లేదు. కర్రోతు బంగారు రాజు వెళ్తున్న కార్యక్రమానికి లోకం మాధవి రావడం లేదు. దీంతో కూటమిలో ఒక రకమైన విచ్ఛిన్నకర పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో బొత్స కుటుంబం పట్టు బిగిస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అందుకే ఈ విషయాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకు వెళ్లే పనిలో పడ్డాయి రెండు పార్టీల శ్రేణులు. అయితే మరోసారి అమరావతికి పిలిచి క్లాస్ పీకుతారా? లేకుంటే కీలక సూచనలు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Tdp in charge ignores jana sena mla
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com