TDP: కూటమి ఎమ్మెల్యేలు( Alliance parties MLAs) క్రమశిక్షణతో మెలగాలని సీఎం చంద్రబాబు ఆదేశిస్తూ వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎమ్మెల్యేలతో సమావేశమై కీలక సూచనలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సోషల్ మీడియా దృష్టంతా ఉంటుందని.. కాస్త జాగ్రత్తగా మసులుకోవాలని సూచించారు. అది మొదలు ఇప్పటి వరకు సందర్భం వచ్చిన ప్రతిసారి అదే మాట చెప్పుకుంటూ వస్తున్నారు చంద్రబాబు. కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఆ మాటను పెడచెవిన పెట్టారు. అస్సలు వినిపించుకోవడం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ యువ ఎమ్మెల్యే వ్యవహార శైలి వివాదాస్పదం అయింది. కూటమి అనుకూల మీడియాకు ఆయన హెచ్చరికలు పంపడం హాట్ టాపిక్ అయ్యింది.
Also Read: కొడాలి నానికి సర్జరీ.. పరిస్థితి ఎలా ఉందంటే?
* ఎన్నికల్లో భారీ విజయం..
శ్రీకాకుళంలో గొండు శంకర్( gondu Shankar ) అనే యువ సర్పంచ్ కు టిడిపి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అప్పటివరకు టిడిపిలో సీనియర్ గా ఉంటున్న గుండ కుటుంబానికి కాదని శంకర్ కు టికెట్ కట్టబెట్టారు చంద్రబాబు. అయితే ఏపీలోనే సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న సిట్టింగ్ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఓడించారు శంకర్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 52,000 ఓట్ల తేడాతో మట్టికరించారు. ఓ జూనియర్ చేతిలో ఓడిపోవడానికి జీర్ణించుకోలేని ధర్మాన ప్రసాదరావు పూర్తిగా రాజకీయ వైరాగ్యం ప్రదర్శించారు. అయితే ఇంతటి విజయాన్ని దక్కించుకున్న శంకర్ దూకుడుగా వ్యవహరిస్తుండటం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం..
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో( Srikakulam Assembly Constituency ) సోమవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే శంకర్. ఇంతలో ఆ గ్రామస్తులు వచ్చి పంచాయితీ కార్యదర్శి పై ఫిర్యాదు చేశారు. సదరు పంచాయతీ కార్యదర్శిని పిలిచిన ఎమ్మెల్యే శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే ఇంతలో ఈనాడు రిపోర్టర్ అక్కడ ఫోటోలను తీసే ప్రయత్నం చేశారు. దీంతో సదరు రిపోర్టర్ పై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే శంకర్. అతనిని పిలిచి మందలించడంతోపాటు ఫోటోలను డిలీట్ చేయించారు. తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేశారు. తాను ఈనాడు రిపోర్టర్ అని చెప్పినా ఎమ్మెల్యే శంకర్ వినలేదు. అనరాని మాటలతో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఈనాడు యాజమాన్యం వరకు వెళ్లినట్లు సమాచారం.
* గతంలో చిత్తూరులో యువ ఎమ్మెల్యే..
అయితే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే సొంత మీడియా గా భావించే ఈనాడు విలేఖరిపై ( Eenadu reporter ) చిందులు వేయడం హాట్ టాపిక్ అవుతోంది. గతంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే సైతం ఈనాడు రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. అది వివాదాస్పదం కావడంతో సీఎం చంద్రబాబు పిలిచి మాట్లాడారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇప్పుడు శంకర్ విషయంలో అదే జరిగే అవకాశం ఉంది.