Homeఆంధ్రప్రదేశ్‌Pawan - TDP - BJP : పవన్ తో టీడీపీ, బీజేపీ పొలిటికల్ గేమ్

Pawan – TDP – BJP : పవన్ తో టీడీపీ, బీజేపీ పొలిటికల్ గేమ్

Pawan – TDP – BJP : రాజకీయంగా తప్పటడుగులు వేస్తే దానిని అధిగమించేందుకు జీవితకాలం సరిపోదు. అటువంటి తప్పటగులు వేసిన వారు చివరికి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి అనివార్య పరిస్థితులను చూశాం. 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పాపానికి  పవన్ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ వంటి ఆరోపణలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. అధినేతపై ఇటువంటి ఆరోపణలు వస్తుండడంతో పార్టీ శ్రేణులు సైతం తట్టుకోలేకపోతున్నాయి. అయినా సరే పవన్ వాటిని సరిచేసుకునే ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం వైసీపీని అధికారం నుంచి దూరం చేయాలన్న ఏకైక లక్ష్యంతో మరోసారి బీజేపీ, టీడీపీని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారా? ఆయనకు బీజేపీలో పరిచయాలు లేవా? పవన్ కు మించి వెయ్యి రెట్లు పరిచయాలు చంద్రబాబుకు ఉన్నాయి. మరి అటువంటప్పుడు చంద్రబాబు వెళ్లి కమలనాథులతో చర్చలు జరపవచ్చు కదా? వస్తానని ఓపెన్ ఆఫర్ ఇవ్వొచ్చు కదా? అంటే సమాధానం లేదు. పోనీ బీజేపీ నమ్మడం లేదన్న విషయానికే వద్దాం. అటువంటప్పుడు బీజేపీ జనసేన మాత్రమే రావాలని కరాఖండిగా చెప్పవచ్చు కదా? టీడీపీ అవసరం లేదని నిర్మోహమాటంగా చెప్పేయవచ్చు కదా? అంటే కమలనాథుల నుంచి మౌనమే ఎదురవుతోంది.

బీజేపీ, టీడీపీకి ఒకరి అవసరం ఒకరికి ఉంది. అటువంటప్పుడు పవన్ మధ్యవర్తిత్వం ఎందుకు? అన్నదే ప్రశ్న. ఆ రెండు పార్టీల కలయిక.. తరువాత వచ్చే పరిణామాలను పవన్ ను తప్పకుండా అంటగడతారు. ఈ విషయంలో చంద్రబాబు మహా శక్తివంతుడు. కుప్పంలో కవ్వించి.. ఇప్పటంలో పవన్ స్పందించేలా చేయడంలో ఆయన చూపిన తెలివితేటలు అన్నీఇన్నీకావు. ఇప్పుడు తన గురించి వకాల్తా కు పవన్ పంపిస్తూనే..దానిలో తప్పిదాలను ఎల్లో మీడియా ద్వారా చూపే ప్రయత్నం చేస్తున్నారు. అవునన్నట్టు నీలిమీడియాలో సైతం అదే కథనాలు ప్రచురిస్తుండడం వెనుక చంద్రబాబు నేర్పరితనం స్పష్టంగా కనిపిస్తోంది.

పోనీ భారతీయ జనతా పార్టీ అయినా తనకు తాను చొరవ చూపుతోందా? అంటే అదీ లేదు. పవన్ ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తోంది. నువ్వొక్కడివే రా.. బాబు అవసరం లేదని పవన్ కు చెప్పడం లేదు. పొత్తు కుదరదని తేల్చిచెప్పడం లేదు. జాతీయ స్థాయిలో తమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏపీ రాజకీయాలను హోల్డ్ లో పెట్టడం దారుణం. ఎన్నికలకు పట్టుమని పది నెలలైనా లేని తరుణంలో టీడీపీ, బీజేపీ ఆడుతున్న గేమ్ లో పవన్ సమిధగా మారుతున్నారు. దీనిపైనే పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటిని పవన్ అధిగమించాలని కోరుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular