Telugu News » Sports » Asia cup team indias second position in group a early decision
Asia Cup 2023 : ఆసియా కప్ : గ్రూప్-ఏలో టీమిండియాది రెండో స్థానమే.. ముందుగానే నిర్ణయం.!
టోర్నీలో పాల్గొంటున్న జట్లను రెండు గ్రూపులుగా విడదీసి మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఏ గ్రూపులో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా బి గ్రూపులో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ జట్లు ఉన్నాయి.
Written By:
BS , Updated On : July 20, 2023 / 05:10 PM IST
Follow us on
Asia Cup 2023 : ఆసియా కప్ కు రంగం సిద్ధమవుతోంది. కొద్ది నెలల నుంచి ఆసియా కప్ నిర్వహణపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఒకానొక దశలో ఈ ఏడాది ఆసియా కప్ ఉండదని అంతా భావించారు. కానీ, చివరి నిమిషంలో భారత్, పాక్ క్రికెట్ బోర్డులు సంయమనం పాటించి వెనక్కి తగ్గడంతో టోర్నీ జరగబోతోంది. ఆగస్టు 30 నుంచి జరగనున్న ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ను పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు బుధవారం సాయంత్రం విడుదల చేసింది. అంతకుముందే ఆసియా క్రికెట్ కౌన్సిల్ హెడ్ ఉన్న జై షా టోర్నీ షెడ్యూల్ ను ట్విట్టర్లో ప్రకటించాడు.
ఆసియా కప్ పోటీలను ఈసారి వరల్డ్ కప్ తరహాలో నిర్వహించనున్నారు. టోర్నీలో పాల్గొంటున్న జట్లను రెండు గ్రూపులుగా విడదీసి మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఏ గ్రూపులో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా బి గ్రూపులో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ జట్లు ఉన్నాయి.
ఏ2 గా నిలవనున్న టీమిండియా..
మ్యాచులు జరగడానికి ముందే ఏ జట్లు ఏ స్థానంలో ఉంటాయన్న దానిపై స్పష్టత వచ్చేసింది. గ్రూప్-4 స్టేజిలో మొదటి మ్యాచ్ లాహోర్లో జరుగుతుంది. ఏ1 వర్సెస్ బి2 జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియా గ్రూపు దశలో టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ ఏ1 స్థానాన్ని దక్కించుకోలేదు. ఎందుకంటే లాహోర్లో సూపర్-4 ఫస్ట్ మ్యాచ్ జరగడంతో భారత్ అక్కడికి వెళ్లి మ్యాచ్ ఆడడం లేదు. దీంతో భారత్ ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అందుకే మొదటి రౌండ్ తర్వాత విన్నింగ్ పాయింట్లతో సంబంధం లేకుండానే టీమ్ పొజిషన్లను ముందుగానే నిర్ణయించారు. గ్రూపు స్టేజి తర్వాత భారత జట్టు స్ధానాన్ని ముందుగానే ఏ2 గా, పాకిస్తాన్ జట్టును ఏ1గా పేర్కొన్నారు. ఒకవేళ వీటిలో ఏదైనా టీమ్ నాకౌట్ కు అర్హత సాధించలేకపోతే ఏ గ్రూపులో ఉన్న నేపాల్ ఆపోజిషన్ కు చేరుకుంటుంది. ఈ మార్పులకు అనుగుణంగానే గ్రూప్ బి లో కూడా పొజిషన్స్ ను ముందుగానే నిర్దేశించారు. బి గ్రూపులో శ్రీలంకను బి-1గా, బంగ్లాదేశ్ జట్టును బి-2గా పేర్కొన్నారు. ఒకవేళ వీటిలో ఏదైనా గ్రూప్ స్టేజ్ దాటకపోతే బి గ్రూప్ లో ఉన్న మరో జట్టు ఆఫ్గనిస్తాన్ ఆ పొజిషన్ కు చేరుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా ఈసారి ఆసియా కప్ లో జట్ల పొజిషన్ లు నిర్ణయించడం గమనార్హం. ఆసియా కప్ పోటీలు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్ తరువాత కొద్ది రోజుల్లోనే వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులకు రానున్న కొద్ది నెలలు పండగే.