Peddireddy Ramachandra Reddy: రాజకీయాల్లో అనుమానాలు, అపార్ధాలు అధికం. చాలా వేగంగా అనుమానాలు కమ్ముకుంటాయి. ఎందుకంటే అది రాజకీయం కనుక. అయితే ఇప్పుడు ఓ ఫ్యామిలీ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే అనుమానంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆ ఫ్యామిలీ గెలిచింది. తాను సైతం చుట్టుపక్కల వారిని గెలిపించలేకపోయాను కానీ.. సదరు ఫ్యామిలీ మొత్తం ఎలా గెలిచింది అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఉన్న అనుమానం. దానికి తోడు ఆ కుటుంబం విషయంలో టిడిపి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. ఆయనలో ఉన్న అనుమానాలను మరింత పెంచుతోంది. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏదో తెలుసా?.. పెద్దిరెడ్డి కుటుంబం. అయితే జగన్మోహన్ రెడ్డి కోసం పరితపించే ఆ కుటుంబం.. ఇప్పుడు ఆయన అనుమానాలకే కారణం అవుతుండడం విశేషం.
* పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎలా గెలిచింది?
2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటులో గెలిచింది. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట ఎంపీ స్థానం నుంచి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి గెలిచారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి లో ఒక రకమైన అనుమానం పెరిగినట్లు వార్తలు వచ్చాయి. పెద్దిరెడ్డి అన్న.. మీ కుటుంబ సభ్యులు మాత్రమే గెలిచారు. అందులో ఏం కిటుకు ఉందో చెప్పండి అన్నా అంటూ నిలదీసినంత పని చేశారట జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేయరు. జోకులు కూడా వెయ్యరట. అటువంటిది ఆయన అలా అడిగేసరికి పార్టీ శ్రేణుల్లో సైతం ఒక రకమైన అనుమానం కనిపిస్తోంది.
* మిధున్ రెడ్డిని కలవని జగన్..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Ramachandra Reddy) కుటుంబం పై కేసులైతే నమోదవుతున్నాయి. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే జైలులో అన్ని రకాల వసతులు కల్పించారు. మూలాఖత్ విషయంలో కూడా ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డిలో మరింత అనుమానం పెంచింది. అందుకే ఆయన కనీసం మిధున్ రెడ్డిని పరామర్శించలేదు. అదే వల్లభనేని వంశీ మోహన్, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి నేతలను జైలుకు వెళ్లి పరామర్శించారు. కానీ తనకు అత్యంత సన్నిహితుడైన, నమ్మకస్తుడైన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని మాత్రం మాట మాత్రానికి కూడా పలకరించలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన మిధున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవలేదు. ఈ పరిణామాలన్నీ అనుమానాలకు దారితీస్తున్నాయి.
* తంబళ్లపల్లెపై అనుమానం..
తాజాగా తంబళ్లపల్లె కల్తీ మద్యం వ్యవహారం బయటపడింది. నకిలీ మద్యం తయారీలో టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందుకే ఆయనపై వేటు పడింది. అయితే ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన ఆయనకు టికెట్ ఎలా వచ్చింది? కూటమి ప్రభంజనంలో సైతం ద్వారకానాథ్ రెడ్డి ఎలా గెలిచారు? ఇలాంటి అనుమానాలు పెద్దగా ఇప్పుడు బలపడుతున్నాయి. తప్పకుండా తమ కుటుంబం గెలిచేందుకు.. రాయలసీమలో టిడిపికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అప్పజెప్పారన్న అనుమానం జగన్మోహన్ రెడ్డిలో ప్రారంభం అయింది. ముఖ్యంగా తనకోసం అనంతపురం జిల్లాను టిడిపికి తాకట్టు పెట్టారని.. అందుకే ఇప్పుడు అరెస్టు కాకుండా పెద్దిరెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారన్న అనుమానాలు జగన్మోహన్ రెడ్డిలో పెరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో పెద్దిరెడ్డిని బిజెపిలో చేర్పించేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.