YS Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఆయన కుమార్తె సునీత మాత్రం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆమె సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేక హత్య కేసు విచారణను కొనసాగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేయగా.. ట్రయల్ కోర్టుగా ఉన్న సిబిఐ న్యాయస్థానం నిందితులకు ఆ నోటీసులను పంపించింది. దీంతో వివేక హత్య కేసు మళ్లీ మొదటకు వచ్చినట్లు అయింది. అయితే ఆది నుంచి వివేక కుమార్తె సునీత న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అడుగులు వేస్తున్నారు. కానీ ఈ కేసులో నిందితులకు ఇంతవరకు శిక్ష పడకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* ఆరేళ్ల కిందట హత్య..
2019 మార్చి 15న దారుణంగా హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. అప్పట్లో టిడిపి( Telugu Desam Party) అధికారంలో ఉంది. రాజకీయపరమైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక సిబిఐ దర్యాప్తు అవసరం లేదని చెప్పుకొచ్చారు. అది మొదలు వివేక కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి సిబి ఐ దర్యాప్తు కొనసాగేలా చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సిబిఐ విచారణకు సహాయ నిరాకరణ ఎదురయింది. అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తి చేసింది సిబిఐ. అయితే వివేకా కుమార్తె సునీత అనుమానాలకు తగ్గట్టు ఈ దర్యాప్తు కొనసాగలేదు. అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సునీత. మళ్లీ విచారణను ప్రారంభం నుంచి చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే అది తమ పరిధిలో కంటే ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది సుప్రీంకోర్టు.
* సిబిఐ కోర్టులో పిటిషన్
తాజాగా సునీత హైదరాబాద్ సిబిఐ( Central Bureau of Investigation ) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోసారి తన తండ్రి మరణం పై విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు. అయితే ఆరేళ్ల కిందట జరిగిన ఘటనకు సంబంధించి ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు. అప్పట్లో సిబిఐ దర్యాప్తు కావాలని ప్రతిపక్షంలో కోరారు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక వద్దన్నారు. కానీ సునీత పోరాటంతో సిబిఐ విచారణ కొనసాగింది. ఇందులో రాజకీయ కక్షపూరిత చర్య ఉందని సిబిఐ గుర్తించింది. చార్జ్ షీట్లో నమోదు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత, ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం అరెస్ట్ కాలేదు. దీనిపైనే పోరాటం చేస్తున్నారు సునీత. కానీ ఆమె విజ్ఞప్తి ని సిబిఐ ట్రయల్ కోర్టు ఎలా పరిగణలోకి తీసుకుంటుందో? చూడాలి. ప్రస్తుతానికి నిందితులందరికీ నోటీసులు ఇచ్చింది. కానీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.