Andhra Pradesh  :  ఫైల్ కదలాలంటే లంచం ఇవ్వాల్సిందే.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు!

పెట్రోల్ బంక్ ఏర్పాటుకు ఎన్వోసీకి దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి అధికారులు చుక్కలు చూపించారు. ఆర్డీవో నుంచి తాసిల్దారు వరకు.. సూపరిండెంట్ నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు తలో మొత్తం వసూలు చేశారు. ఈ లంచాలకు విసిగి వేశారి పోయిన బాధితుడు సిసిఎల్ఏ కి ఫిర్యాదు చేశాడు. కానీ విచారణ పేరుతో వైసిపి హయాంలో కాలయాపన జరిగింది. కూటమి ప్రభుత్వం ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది.

Written By: Dharma, Updated On : September 21, 2024 3:26 pm

Corruption

Follow us on

Andhra Pradesh  : వైసిపి హయాంలో అవినీతి రాజ్యమేలింది అన్నది టిడిపి కూటమి ప్రభుత్వం అనుమానం. నాటి ప్రభుత్వ ప్రజల అడుగులకు మడుగులొత్తిన అధికారులపై వరుసగా వేటుపడుతోంది. అయితే ఒక్క అధికారులే కాదు కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బందిపై సైతం కొరడా ఝలిపిస్తోంది కూటమి ప్రభుత్వం. ఓ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడానికి ఓ వ్యక్తి నుంచి తన క్యాంపు క్లర్క్ ద్వారా లక్ష రూపాయలు డిమాండ్ చేసిన తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అప్పటి పుత్తూరు తహసిల్దార్ సోమేశ్వర స్వామి, తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్ గా పనిచేస్తున్న సురేష్ కుమార్ పై సైతం వేటు పడింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఓసి జారీకి సంబంధిత ఫైల్ ను తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని కోరితే లంచం డిమాండ్ చేశారని కిషోర్ కుమార్ అనే వ్యక్తి సిసిఎల్ఏ కి ఫిర్యాదు చేశారు.

* ఎన్వోసీకి లంచం
కిషోర్ కుమార్ అనే వ్యక్తి పెట్రోల్ బంక్ ఏర్పాటుకు నిర్ణయించారు. దానికి నిరభ్యంతర పత్రాలు జారీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే కలెక్టర్ సిఫార్సు చేశారని.. రూ.50 వేలు డిస్కౌంట్ ఇస్తున్నామని… మిగతా 50,000 మా క్యాంప్ క్లబ్ నరేంద్ర ద్వారా తనకు పంపించాలని తిరుపతి ఆర్డిఓ నిశాంత్ రెడ్డి డిమాండ్ చేశారని కిషోర్ కుమార్ ఆరోపించారు. అప్పటికే భూమార్పిడికి 30 వేల రూపాయలు వసూలు చేశారని.. ఆ తర్వాత పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చేందుకు లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారని కిషోర్ కుమార్ మోపుతున్న అభియోగం.అప్పటి పుత్తూరు తాసిల్దారుగా పనిచేసిన పరమేశ్వర స్వామి 20000 లంచం తీసుకున్న తర్వాత కూడా.. సంతకం చేయకుండా ఆ ఫైల్ ఆర్డీవోకి పంపించారని బాధితుడు ఆరోపించాడు.

* కలెక్టర్ కార్యాలయంలో కూడా
అదేవిధంగా తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్ గా పనిచేస్తున్న సురేష్ కుమార్ ఆ ఫైల్ ను వివిధ శాఖల అధికారులకు పంపించడానికి 20,000 తన దగ్గర లంచం తీసుకున్నారని బాధితుడు చెబుతున్నాడు. అయితే బాధితుడు ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 25న విచారణ చేసిన సీసీఎల్ఏ ఏసీబీకి అప్పగించాలని అప్పటి వైసీపీ ప్రభుత్వానికి విన్నవించింది. అయితే అధికారులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు మరో అవకాశం ఇచ్చేందుకు కలెక్టర్ కు తర్వాత విచారణ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ విచారణ ముందుకు కదలలేదు.

* తాజాగా జెసి నివేదికతో
తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ విషయంపై త్వరితగతిన విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీకి ఆదేశాలు జారీచేసింది. గత వైసిపి ప్రభుత్వంలో ఆర్డీవో నిశాంత్ రెడ్డి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు కామెంట్స్ వినిపించాయి. వైసిపి నేతల సిఫార్సులతో ఇబ్బందులకు గురి చేసేవారని బాధితులు ఆరోపించేవారు. ఎట్టకేలకు ఆయనపై చర్యలకు ప్రభుత్వం దిగడంతో చాలామంది స్వాగతిస్తున్నారు.