Gurbaz : ఆఫ్ఘనిస్తాన్ తన వన్డే చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో సౌత్ఆఫ్రికా పై 177 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ సంచలన ఆటతీరుతో ఆ జట్టును ఓడించింది. మొదటి, రెండు వన్డేలలో విజయం సాధించి తొలిసారిగా అంతర్జాతీయ ట్రోఫీని దక్కించుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 311 రన్స్ చేసింది. ఓపెనర్ గుర్బాజ్ 105 పరుగులు చేసి మైదానంలో విధ్వంసం సృష్టించాడు. నిప్పుకు ఉప్పుతోడైనట్టు.. అతడికి అజ్మతుల్లా (86) సహకరించాడు. రహమత్ 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ 311 పరుగుల భారీ స్కోర్ చేసింది.. 312 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా 34.2 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. దీంతో 177 పరుగుల భారీ విజయాన్ని ఆఫ్ఘనిస్తాన్ సొంతం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంలో గుర్బాజ్ కీలకపాత్ర పోషించాడు. అతడు కీలక ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ వేలంలో ఇతడికి విపరీతమైన డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
ఐపీఎల్ లో ఆడాడు
గుర్బాజ్ ఐపీఎల్ లో కోల్ కతా జట్టు కోసం ఆడాడు.. కోల్ కతా జట్టనుంచి సాల్ట్ నిష్క్రమించిన తర్వాత గుర్బాజ్ కు ఆడే అవకాశం లభించింది. అయితే వచ్చే వేలంలో కోల్ కతా జట్టు శ్రేయస్ అయ్యర్, రస్సెల్, సునీల్ నరైన్, రింకూ సింగ్ ను కొనసాగించాలని భావిస్తోంది. అందువల్ల గుర్బాజ్ ను దక్కించుకునేందుకు ఇతర జట్లు పోటీపడే అవకాశం ఉంది. ఇందులో చెన్నై జట్టు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గుర్బాజ్ స్థిరంగా ఆడతాడు. బలమైన షాట్లు కొడతాడు. కుదురుకునేందుకు స్వల్ప సమయం తీసుకుంటాడు. ఆ తర్వాత మైదానంలో విధ్వంసం సృష్టిస్తాడు. చెన్నై జట్టు కాన్వే స్థానంలో గుర్బాజ్ ను తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు గుర్బాజ్ లీగ్ లతో కలిపి 192 t20 మ్యాచ్ లు ఆడాడు. పైగా గుర్బాజ్ వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. అందువల్ల చెన్నై జట్టు ఇతడిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.