AP Election Survey 2024: ఏపీలో గెలుపెవరిది? ఏ పార్టీ గెలుస్తుంది? దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరో మూడు రోజుల వ్యవధిలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించనున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం ఏడు విడతల్లో జరిగిన లోక్సభ ఎన్నికలు.. జూన్ 1 ఏడో విడతతో ముగుస్తాయి. ఆరోజు ఎగ్జిట్ పోల్స్ ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమ నివేదికలను రాజకీయ పార్టీల అధినేతలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని జగన్ ప్రకటించారు. మరోవైపు మెజారిటీ స్థానాలు గెలుచుకొని అధికారాన్ని అందుకుంటామని కూటమి నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ ఉంది.
అధికార వైసీపీకి సంబంధించి మూడు సర్వే నివేదికలను జగన్ తెప్పించుకున్నట్లు సమాచారం. మరోవైపు సొంత మీడియా సంస్థ ద్వారా సర్వే చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ అనంతరం.. కేంద్రాల నుంచి తెప్పించుకున్న సమాచారం మేరకు గెలుపు పై ఒక ధీమాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఓటింగ్ పెరగడం, మహిళా ఓటర్లు ఆసక్తి చూపడం, వృద్ధులు సైతం ఓటింగ్ లో పాల్గొనడం తమకు కలిసి వస్తుందని వైసిపి ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఆ వివరాలన్నీ క్రోడీకరించిన తరువాతే సీఎం జగన్ ఆ ప్రకటన చేసి ఉంటారని తెలుస్తోంది.
మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని.. చివరి మూడు రోజుల్లో పరిస్థితి మారిందని టిడిపి కూటమి అంచనా వేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ఈసీ సంపూర్ణ సహకారం అందించడం, వైసిపి నిట్టూర్పు మాటలే తమ గెలుపునకు సంకేతాలని టిడిపి కూటమి నేతలు చెబుతున్నారు. అయితే గెలుస్తామని చెబుతున్న టిడిపి కూటమి నేతలు.. మెజారిటీ సీట్లు ఎంత వస్తాయి అన్నది చెప్పడం లేదు. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు అధిగమిస్తామని.. 110 వరకు సీట్లను సొంతం చేసుకుంటామని మాత్రం చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి వారు గెలుస్తామన్న ధీమా మాటలతో గడుపుతున్నారు. కానీ రెండు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఏపీలో వార్ వన్ సైడేనని నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వైసీపీతో కుమ్మక్కు అయ్యాయని.. జూన్ 4న టిడిపి కూటమి మంచి విజయం సాధిస్తుందని.. ఎగ్జిట్ పోల్స్ నమ్ముకొని ఆందోళన చెందవద్దని.. ఎటువంటి బెట్టింగులు కట్టవద్దని టిడిపి నాయకత్వం అంతర్గతంగా శ్రేణులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చాలా వరకు సంస్థలు పబ్లిక్ పల్స్ పట్టడంలో ఇబ్బంది పడ్డాయి. అందుకే హోరాహోరి ఫైట్ ఉంటుందని చెప్పేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం.