YCP: ఆ రెండు వర్గాల ఓట్లు రానట్టే.. వైసిపి ఫిక్స్

గత ఐదేళ్లుగా వైసీపీ బాధిత వర్గాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు మిగిలారు. ప్రత్యర్థుల కంటే శత్రువులుగా మారిపోయారు. గత ఎన్నికల్లో ఆ రెండు వర్గాలువైసీపీకి సంపూర్ణంగా మద్దతు తెలిపాయి.

Written By: Dharma, Updated On : May 29, 2024 7:27 pm

YCP

Follow us on

YCP: నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదు.. మగధీరలో విలన్ చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు వైసీపీ నుంచి వినిపిస్తుంది ఆ మాట. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఈసీనే ప్రశ్నించినంత పని చేస్తోంది వైసిపి. ఉద్యోగుల ఓట్లు చెల్లుబాటు కాకూడదన్నదే వైసిపి చేస్తున్న ప్రయత్నం. ఇందుకోసం ఏకంగా ఎలక్షన్ కమిషన్ పైనే నిందలు వేసే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అనుకూల మీడియా. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు విషయంలో ఈసీ మినహాయింపులు ఇవ్వడమే వైసీపీ అభ్యంతరానికి కారణం. కేవలం ఉద్యోగ, ఉపాధ్యాయులు తమకు వ్యతిరేకంగా ఉన్నారని.. వారి ఓట్లు చెల్లుబాటు కాకుండా చూడాలన్నదే వైసిపి ప్లాన్ గా తెలుస్తోంది.

గత ఐదేళ్లుగా వైసీపీ బాధిత వర్గాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు మిగిలారు. ప్రత్యర్థుల కంటే శత్రువులుగా మారిపోయారు. గత ఎన్నికల్లో ఆ రెండు వర్గాలువైసీపీకి సంపూర్ణంగా మద్దతు తెలిపాయి. ఏకపక్షంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకి లభించాయి. కానీ ఎన్నికలకు ముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు జగన్ ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణం సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే సిపిఎస్ రద్దు చేయకపోగా.. గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీలను సైతం నిలిపివేశారు. జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేదు.ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతం.. రెండో వారానికి, మూడో వారానికి తీసుకెళ్లారు. ఇన్ని పరిణామాలతో ఆ రెండు వర్గాలు వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహాన్ని పెంచుకున్నాయి. కసిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశాయి.

అయితే ఎన్నికలకు ముందు ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. వారిలో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని వైసిపి సర్కార్ ప్రయత్నించింది. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. సొంత ప్రాంతంలో ఓటు వేయాలని ఒకసారి.. పనిచేసిన ప్రాంతంలో వేయాలని మరోసారి.. ఇలా ఒక రకమైన గందరగోళాన్ని సృష్టించారు. కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు విసుగు చెందలేదు. ఓపికగా ఓటు వేశారు. గత ఎన్నికల్లో లక్షన్నర పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఈసారి మాత్రం నాలుగు లక్షల 90 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కావడం కొత్త రికార్డు. ఇదే అధికార వైసీపీలో కంటిమీద కునుకు లేకుండా చేసే అంశం.

అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకు రావని వైసిపి ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. కొద్దిరోజుల కిందట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కొన్ని రకాల మినహాయింపులు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పై ఆర్వో సంతకం, సీల్ వుంటేనే గతంలో చెల్లుబాటుగా పరిగణించేవారు. కానీ ఈసారి సంతకం ఉంటే చాలు. సీల్ లేకపోయినా పరిగణలోకి తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా ప్రకటించింది. అయితే ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లు పడవని నిర్ణయానికి వచ్చిన వైసీపీ దీనిపై అభ్యంతరాలు చెబుతోంది. ఈ విషయంలో ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రశ్నిస్తోంది. మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తమకు ఇబ్బందులు తప్పవని వైసిపి భయపడడం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ముందుగా లెక్కించేది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కనుక.. టిడిపి కూటమికి మెజారిటీతో లెక్క ప్రారంభమవుతుందనేది ఒక అంచనాగా తెలుస్తోంది.