Janasena: పవన్ అను నేను.. జనసేనలో గెలుపు జోష్

జనసేన ఏర్పాటు చేసి దశాబ్ద కాలం దాటుతోంది. గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేశారు పవన్. కానీ రెండు చోట్ల ఓడిపోయారు. ఆయనపై వైసీపీ గెలిచింది. గెలిచినవారు సామాన్యులు కాగా.. గెలిచిన పార్టీగా వైసిపి గర్వ భావంతో.. పవన్ పై ఫెయిల్యూర్ ముద్రను వేసింది.

Written By: Dharma, Updated On : May 29, 2024 7:35 pm

Janasena

Follow us on

Janasena: గెలుపు అన్నమాట జనసేనకు కొత్తే. 2014 ఎన్నికలకు ముందు పార్టీని స్థాపిస్తే.. ఇంతవరకు ఆ పార్టీకి శాసనసభలో ప్రాతినిధ్యం దక్కలేదు. గత ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం దక్కింది. అది కూడా వైసిపి లాక్కొని పోయింది. దీంతో గెలుపు అన్న మాట సగటు జన సైనికుడి చెవులకు వినిపించలేదు. కళ్ళకు కనిపించలేదు. అయితే ఈసారి గెలుపు అనే మాట పక్కాగా వినిపిస్తోంది. పవన్ తో పాటు డజనుమంది తగ్గకుండా శాసనసభకు వెళ్తారని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ అను నేను అనే మాట తప్పకుండా వినిపిస్తుందని జనసైనికులు ఆశాభావంతో ఉన్నారు. పిఠాపురం నుంచి పవన్ గెలుపు ఖాయం అన్న ధీమాతో ఉన్నారు. గెలుపు ఫిక్స్ అని.. మెజారిటీ మాట చెప్పండి అని ఎక్కువమంది సవాల్ చేస్తున్నారు. జూన్ 4 తర్వాత జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పక్కాగా నిర్వహించాలని భావిస్తున్నారు.

జనసేన ఏర్పాటు చేసి దశాబ్ద కాలం దాటుతోంది. గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేశారు పవన్. కానీ రెండు చోట్ల ఓడిపోయారు. ఆయనపై వైసీపీ గెలిచింది. గెలిచినవారు సామాన్యులు కాగా.. గెలిచిన పార్టీగా వైసిపి గర్వ భావంతో.. పవన్ పై ఫెయిల్యూర్ ముద్రను వేసింది. కిందిస్థాయి నేతనుంచి సీఎం జగన్ వరకు పవన్ ఓటమి నాయకుడని ధ్వనించింది. ఎన్నో రకాల అవమానాలు, మరెన్నో చీదరింపు మాటలు జన సైనికులకు ఎదురయ్యాయి. అసలు మంత్రి రోజా లాంటి వాళ్ళు జనసేన అనేది ఒక పార్టీయేనా? రెండు చోట్ల ఓడిన వాడు ఒక నాయకుడేనా? అని పవన్ గురించి ఎద్దేవా చేసిన సందర్భాలు ఉన్నాయి.

పవన్ తెలుగు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉన్న హీరో. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినా సరే గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయారు. రాజకీయ అభిమానం ముందు.. సినీ అభిమానం చెల్లదు అని విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి. అందుకే గత ఎన్నికలను ఒక గుణపాఠంగా తీసుకున్నారు పవన్. ఈసారి ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టాలని బలమైన ఆకాంక్షతో ముందుకు సాగారు. కాపు సామాజిక వర్గంతో పాటు సినీ అభిమానం ఈసారి కదలి వచ్చింది. పవన్ కు మద్దతుగా మెగా కుటుంబంతో పాటు బుల్లితెర నటులు ప్రచారం చేశారు. పేరు మోసిన కథానాయకులు మద్దతు ప్రకటించారు. ఇవన్నీ కలిసి వచ్చినట్టు కనిపించాయి. పిఠాపురంలో పవన్ కచ్చితంగా గెలుస్తాడు అన్న అంచనాకు ప్రత్యర్ధుల సైతం వచ్చారు. ఈ పరిణామ క్రమంలో గెలుపు అన్న మాటను ఇప్పటివరకు వినని జనసైనికులు, మెగా అభిమానుల్లో ఒక రకమైన జోష్ కనిపిస్తోంది.