Chandrababu House Attack Case
Chandrababu House Attack Case: ఏపీలో( Andhra Pradesh) మరో ఆసక్తికర పరిణామం. వైసిపి ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్షనేత చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది సంచలన అంశంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ పని చేయడంతో పోలీసులు చిన్న చిన్న సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణలో పురోగతి పెరిగింది. ఏపీ పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్, మరో నేత దేవినేని అవినాష్ తో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. అయితే ఈ కేసు విషయంలో అరెస్టుల పర్వం ప్రారంభమవుతుందని అంతా భావించారు. అయితే నిందితులు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్టులనుంచి తప్పించుకున్నారు.
* అప్పట్లో దాడి అలా
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. ఈ క్రమంలో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్, దేవినేని అవినాష్ చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు బయలుదేరారు. భారీ కాన్వాయ్ తో ఇంటి గేటు వద్దకు చేరుకున్నారు. అప్పట్లో టిడిపి నేతలతో పాటు పోలీసులు అడ్డుకోవడంతో వెనుతిరి గారు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ చిన్న చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. కనీసం అరెస్టులు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు పూర్తిస్థాయిలో కేసులు నమోదు చేశారు. అరెస్టుల పర్వానికి సైతం దిగారు.
* పలుమార్లు విచారణ
ఇప్పటికే చంద్రబాబు( Chandrababu) ఇంటిపై దాడికి సంబంధించిన కేసులో పోలీసులు పలుమార్లు వీరిని విచారించారు. అయితే తమను అరెస్టు చేస్తారని భావించిన వీరు కోర్టును ఆశ్రయించారు. నిర్దిష్ట సమయం వరకు అరెస్టు చేయవద్దని కోర్టు సైతం ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు గడువు ముగిసిపోవడంతో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దేవినేని అవినాష్, జోగి రమేష్ తో సహా 20 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వీరికి ముందస్తు మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వీరందరికీ ఊరట లభించినట్లు అయింది. అయితే వీరిని దేశం విడిచి వెళ్ళవద్దని.. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని కోర్టు ఆంక్షలు విధించింది.
* వల్లభనేని వంశీ అరెస్టుతో..
ఇప్పటికే వల్లభనేని వంశీ( Vamsi )అరెస్టు అయ్యారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసుల మీద కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అని జోగి రమేష్ తో పాటు దేవినేని అవినాష్ భయపడ్డారు. కానీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కొంత ఉపశమనం పొందారు. అయితే చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి కేసు విచారణ లో ఆలస్యం జరగడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.