Summer Holidays : ఎట్టకేలకు విద్యార్థులకు ఊరట లభించనుంది. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన వారికి కాస్త విశ్రాంతి లభించనుంది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు నేడు చివరి పని దినం ముగిసింది. రేపటి నుంచి అంటే ఏప్రిల్ 24వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభమవుతాయి.
Also Read: ఇండియన్ స్విట్జర్లాండ్.. పహల్గాం గురించి ఆసక్తికర సంగతులు
ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున పిల్లలు మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. వేసవి సెలవుల్లో పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా కోనేరులు, చెరువులు, కాలువల వంటి నీటి వనరుల వద్దకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈ వేసవి సెలవులు విద్యార్థులకు చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, వారిలోని క్రియేటివిటీని వెలికితీసేందుకు కొత్త విషయాలు నేర్చుకునేందుకు, ఆటపాటలతో ఆనందంగా గడిపేందుకు ఒక మంచి అవకాశంగా ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు కూడా ఈ సమయాన్ని తమ పిల్లలతో గడపడానికి, వారి అభిరుచులను తెలుసుకోవడానికి, వారిని ప్రోత్సహించడానికి ఉపయోగించుకోవచ్చు.
అయితే, సెలవుల సమయంలో పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎండలో ఎక్కువగా తిరగకుండా, సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తిరిగి జూన్ 12న నూతనోత్సాహంతో పాఠశాలలకు హాజరయ్యేందుకు సిద్ధం కావాలని విద్యాశాఖ కోరుతోంది.