AP Rains: ఏపీకి మరో హెచ్చరిక. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడనుంది. దీని ప్రభావం ఏపీ పై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాగల రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గత కొద్ది రోజులుగా వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఏపీ పై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వరి కోతలు జరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రాగల రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడుతుందని.. మొత్తం నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని చెబుతోంది వాతావరణ శాఖ.
* అన్ని ప్రాంతాల్లో వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. బుధవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రెండు రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.
* వేటకు మత్స్యకారులు దూరం
మరోవైపు రాష్ట్రంలోని తీర ప్రాంతంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని ప్రభుత్వం ఆదేశించింది. దక్షిణ కోస్తాలో తుఫాన్ తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఒకవైపు ఆకాశం మేఘావృతం కావడం.. ఇంకో వైపు చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సాయంత్రం 4గంటల నుంచి పొగ మంచు తీవ్రత అధికంగా ఉంది. ఉదయం 10 గంటల వరకు అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో రహదారులపై రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది.