Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం విడుదలై 13 రోజులు పూర్తి అయ్యింది. ఒక సినిమాకి విడుదల రోజు కాకుండా, 11 వ రోజు 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రావడం ఇంతకు ముందు ఎప్పుడైనా చూశామా?, అలాంటి అద్భుతమైన అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పింది ఈ సంచలనాత్మక చిత్రం. మొదటి వారం లోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు 1500 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుకి అతి చేరువలో ఉంది. నిర్మాతలు వేసే పోస్టర్స్ లో అయితే ఈ సినిమా ఇప్పటికే 1500 కోట్లు దాటేసింది కానీ, ట్రేడ్ లెక్కల్లో ఇంకా కాస్త దూరంలో మాత్రమే ఉంది. రాబోయే రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వీకెండ్స్ ఉన్నాయి. కచ్చితంగా వాటిని ఈ చిత్రం సరిగ్గా ఉపయోగించుకొని 2000 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇదంతా పక్కన పెడితే 13 రోజులకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు మనం వివరంగా ప్రాంతాల వారీగా చూద్దాము. నిన్న ఒక్కరోజే ఈ చిత్రం 35 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టిందట. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి హిందీ వసూళ్లు చాలా స్టడీ గా ఉండగా, మిగిలిన భాషల్లో మాత్రం వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. గ్రాస్ లెక్కల్లో చూస్తే నాలుగు కోట్ల రూపాయిలు ఉంటుందని సమాచారం. అదే విధంగా హిందీ వెర్షన్ లో నిన్న ఒక్క రోజు ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. గ్రాస్ లెక్కల్లోకి చూస్తే 28 కోట్ల రూపాయిలు ఉంటుంది.
ఓవరాల్ గా తెలుగు + తమిళ వెర్షన్స్ కి కలిపి 32 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి ప్రాంతాలకు కలిపి మొత్తం మీద 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని, ఓవరాల్ గా 13 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 1425 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. నిన్న కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 18 నుండి 25 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ స్థాయి ట్రెండ్ గతంలో మన స్టార్ హీరోలకు మొదటి రోజు, రెండో రోజు ఉండేది. ఇప్పుడు పుష్ప చిత్రానికి రెండవ వారంలో కూడా ఆ రేంజ్ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ స్థాయి బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలుస్తుందని బహుశా మూవీ టీం కూడా ఊహించి ఉండదు.