Jamili Elections: ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పార్టీకి భవిష్యత్తు అన్నది కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో కేంద్రం జమిలి ఎన్నికలకు ప్లాన్ చేయడంతో వైసీపీకి కొత్త ఆశలు వచ్చాయి. 2027 ద్వితీయార్థంలో ఎన్నికలు వస్తాయని వైసిపి అంచనా వేసింది. జగన్ సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే జమిలిపై కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగింది. ఏకంగా పార్లమెంటులో బిల్లు పెట్టింది. ఓటింగ్ నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన పార్టీలుగా ఉన్న టిడిపి, వైసిపి, బిఆర్ఎస్ బిల్లుకు మద్దతు తెలిపాయి. ఎన్డీఏ పక్షంగా టిడిపి మద్దతు తెలపగా.. జమిలి లో భాగంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆశించిన వైసిపి, బిఆర్ఎస్ సైతం తమ మద్దతును ప్రకటించాయి. కానీ వైసీపీ ఆశిస్తున్నట్టు ముందస్తు ఎన్నికలు వచ్చి అవకాశం లేదని తాజాగా తేలిపోయింది.
* దేశవ్యాప్తంగా చర్చ
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై విస్తృత చర్చ జరుగుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల తో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్నది జమిలి లక్ష్యం. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు పై లోక్ సభలో ఓటింగ్ నిర్వహించారు. తొలిసారిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు వ్యతిరేకించాయి. అనుకూలంగా 269 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. వాస్తవానికి రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండో వంతు మెజారిటీ పొందాల్సి ఉంటుంది. అయితే మూడింట రెండు వంతుల మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదు.
* ఆశలపై నీళ్లు
వాస్తవానికి జమిలి బిల్లు ఆమోదం పొందినా.. ఎన్నికలు మాత్రం ముందస్తుగా జరిగే అవకాశం లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. కానీ వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలు ఉంటాయని నమ్మకంగా చెబుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ బిల్లు పాస్ కాకపోవడంతో వైసీపీకి షాక్ తగిలినట్లు అయింది. జమిలి ఎన్నికలపై బోలెడు ఆశలు పెట్టుకుని వైసిపి. ఎన్నికలు సమీపంలోనే ఉండడంతో వైసిపి నుంచి నేతలు వెళ్లిపోవడాన్ని నియంత్రించవచ్చని భావించింది. కానీ వైసీపీ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.