Chandrababu: ఏపీలో ఇప్పుడు రాళ్లదాడి హాట్ టాపిక్ గా మారుతోంది. సీఎం జగన్ పై గులకరాయి దాడి జరిగిన తర్వాత ఇదో ప్రాధాన్యతాంశంగా మారిపోయింది. అయితే సానుభూతి కోసమే జగన్ తనకు తానుగా చేయించుకున్నారని టిడిపి ఆరోపిస్తుండగా.. ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ చేసిన పని అని వైసిపి ఆరోపణ చేస్తోంది. దాడి జరిగిన మరుక్షణం అంబటి లాంటి నేత చంద్రబాబు పేరు బయట పెట్టారు. చంద్రబాబు దీనికి బాధ్యుడంటూ తేల్చేశారు. అయితే ఎన్నికల సమయంలో అధికార పార్టీ అధినేత, ఆపై ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్ పై దాడి చేసే ప్రయత్నం చేస్తారా? అంత ఆలోచనకు వస్తారా? పోనీ సానుభూతి కోసం ఇలాంటి చర్యలకు ఎవరైనా దిగుతారా? అంటే మాత్రం సమాధానం దొరకదు. ఎందుకంటే ఇదో పొలిటికల్ ఇష్యూ గా మారిపోయింది. అందుకే ఈ ఘటన ద్వారా ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని అధికార,విపక్షం ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.
అయితే చంద్రబాబు చేశారని బలంగా నిరూపించేందుకు వైసిపి ప్రయత్నిస్తుండడం విశేషం. గతంలో చంద్రబాబు జగన్ పై విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలే రాళ్లదాడి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆ వీడియోను సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి బయట పెట్టారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి.. అప్పట్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సెల్ ఫోన్ లో చూపించారు. ప్రజా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్న జగన్ ఫై రాళ్ల దాడి చేసినా తప్పు లేదని అప్పట్లో చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పుడు తాజాగా జగన్ పై గులకరాయి దాడి జరగడంతో.. అది చంద్రబాబు పనేనంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో నేతల భాష, వ్యవహార శైలి ఏనాడో మారిపోయాయి. ప్రత్యర్థి పై ఆరోపణలు చేసే క్రమంలో.. భాష ప్రయోగం ఏమాత్రం సహేతుకంగా లేదు. ఇదే సీఎం జగన్ చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీయాలని పిలుపునిచ్చారు. చాలా రకాలుగా వ్యక్తిగతంగా మాట్లాడారు. మాజీ సీఎం హోదాలో, ఒక ప్రతిపక్ష నేతగా సొంత నియోజకవర్గం కుప్పంకు వెళ్లేటప్పుడు ఈ తరహా దాడులు జరిగాయి అందరికీ తెలిసిన విషయమే. అంతమాత్రానికి అది జగనే చేయించారా? అని అనగలమా? కానీ ఇప్పుడు చంద్రబాబు జగన్ పై దాడి చేయించారని సజ్జల లాంటి నేతలే ప్రెస్ మీట్ పెట్టి మరి చెబుతుండడం కొంచెం అతి అవుతుంది. ఎన్నికల అన్నాక వ్యూహాలు ఉంటాయి. ప్రతి వ్యూహాలు ఉంటాయి. కానీ ఈ తరహా ఎమోషనల్ రాజకీయాలు ప్రజలకు శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.