https://oktelugu.com/

CM Jagan Publicity: చైతన్య, నారాయణను మించిపోయిన జగన్ పబ్లిసిటీ

ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలపై స్పందించే క్రమంలో ఎలా ముందుకెళ్లాలో వైసీపీ శ్రేణులకు తెలియడం లేదు. ఈ ఫలితాలను మేము నమ్మమని.. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సాధ్యం కాదని వైసీపీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 7, 2023 / 08:30 PM IST
    Follow us on

    CM Jagan Publicity: సాధారణంగా వేసవిలో ప్రసార మాధ్యమాల్లో రణగొణ ధ్వనులు వినిపిస్తుంటాయి. ఒకటి, రెండు, మూడు అంటూ పదెల అంకెల వరకూ ర్యాంకులు అంటూ నారాయణ, చైతన్య లాంటి పేరు మోసిన విద్యాసంస్థలు హోరెత్తిస్తుంటాయి. పదో తరగతి, ఇంటర్, ఎంసెట్, నీట్..ఇలా అన్నిరకాల పరీక్షల ఫలితాలు వెలువడినప్పుడు ఈ ర్యాంకుల హడావుడి ఎక్కువగా ఉంటుంది. అయితే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టినట్టు చెబుతున్న జగన్.. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ర్యాంకుల గోల వద్దంటూ కొన్నిరకాల నిబంధనలు తెరపైకి తెచ్చారు. కానీ ప్రైవేటు విద్యాసంస్థలు ఈ ప్రచార శైలిని మాత్రం వీడలేదు. అయితే ప్రైవేటు సంస్థలు కాబట్టి వారిది అడ్మిషన్ల గోల. అయితే అదే పంథాను ఇప్పుడు జగన్ సర్కారు అనుసరించడం మాత్రం కొత్తగా ఉంది. పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలు అగ్రగామిగా నిలిచాయని మీడియాతో పాటు సోషల్ మీడియాలో అతిగా ప్రత్యేక ప్రకటనలో చూపిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    జగన్ సర్కారు విప్లవాత్మక మార్పులు మూలంగానే ఇది సాధ్యమైందని చూపేందుకు యంత్రాంగం ఆరాటపడుతోంది.
    నాడునేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని ..కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ విద్యను అందిస్తున్నట్టు చూపేందుకే ఈ తహతహ. తద్వారా ప్రజాభిమానం చూరగొనాలన్నదే జగన్ సర్కారు అభిమతం. కానీ ఒకసారి ఫలితాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణతాపరంగా వెనుకబడ్డాయి.ఏకంగా 38 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనను ప్రశ్నించేలా ఈ ఫలితాలు ఉన్నాయి. కానీ అది మరుగునపడేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

    రాష్ట్రవ్యాప్తంగా 72.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మాదిరిగానే బాలురు కన్నా బాలికలే అత్యధిక ఉత్తీర్ణత సాధించడం విశేషం. బాలుర కన్నా బాలికలే 6.11 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 5 శాతం ఉత్తీర్ణత పెరిగినట్టు ప్రభుత్వం చెబుతోంది. 933 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు ప్రచారం చేసుకుంటోంది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్టు తెలుస్తోంది.

    అయితే ఈ తరహా ప్రచారం సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి సొంత పార్టీ శ్రేణులే భిన్నంగా స్పందిస్తున్నాయి. అవి వాస్తవ విరుద్ధ ఫలితాలు అంటూ సెటైర్లు వేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి ఉపాధ్యాయవర్గాల మధ్య భిన్న వాతావరణం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలపై స్పందించే క్రమంలో ఎలా ముందుకెళ్లాలో వైసీపీ శ్రేణులకు తెలియడం లేదు. ఈ ఫలితాలను మేము నమ్మమని.. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సాధ్యం కాదని వైసీపీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు సైతం ప్రభుత్వ ప్రచారానికి ఏకీభవించడం లేదు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కామెంట్స్ చేస్తున్నాయి. ఇది ప్రభుత్వ అతి ప్రచారంగా చెప్పుకొస్తున్నాయి.