YS Jagan tweet goes viral: 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే ఫలితం. ఇటీవలి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉప ఎన్నికల్లోనూ చేదు ఫలితం.. అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలనూ ఊహించని రిజల్ట్.. పైగా తన ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పని చేసిన వారు.. కీలక నాయకులుగా పనిచేసినవారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్తున్నారు. ఇంత ఒత్తిడి మధ్య.. ఈ స్థాయిలో ఉక్కపోత మధ్య జగన్ తన కేడర్ చేజారి పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో బలం పెంపొందించడానికి తనవంతుగా ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆయన నిలదీస్తున్నారు. తన ప్రభుత్వానికి.. కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడాను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతుందని ఆరోపిస్తున్నారు జగన్. అంతేకాదు రీ కాల్ బాబు అంటూ ఇటీవల ఒక యాప్ కూడా తెరపైకి తీసుకొచ్చారు. మొత్తానికి పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఉత్సాహాన్ని నింపుతున్నారు. గుంటూరు నుంచి మొదలుపెడితే నెల్లూరు వరకు ప్రతి పర్యటనలోనూ భారీగా జన సమీకరణ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు జగన్.
Also Read: జైల్లోనే చంద్రబాబు.. కోట వినూత బయటికి వచ్చింది.. రాయుడు కేసులో ఏం జరుగుతోంది!
ఇటీవల పులివెందుల జడ్పిటిసి స్థానానికి, ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు జగన్ తనదైన శైలిలో స్పందించారు. ఫలితాలకు ఒకరోజు ముందు కూడా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలీసు అధికారులపై కూడా తనదైన శైలిలో ఆరోపణలు చేశారు. అవి వైసిపి నాయకులకు ఆనందాన్ని కలిగించినప్పటికీ.. మిగతావారు మాత్రం జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నారు. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలను కూడా వైసిపి నాయకులు అంగీకరించడం లేదు. పైగా ఎన్నికల సంఘం రెడ్ హ్యాండెడ్ గా కూటమి ప్రభుత్వానికి సరెండర్ అయిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇక శనివారం కృష్ణాష్టమి సందర్భంగా జగన్ కీలక ట్వీట్ చేశారు. అధర్మం ఎంత వేగంగా ముందుకెళ్లిన అది తాత్కాలికమేనని.. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతమని.. శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతమే ఇందుకు నిదర్శనమని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందేశంలో కూడా జగన్ రాజకీయ అంశాలను పరోక్షంగా ప్రస్తావించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల పులివెందులలో, ఒంటిమిట్టలో గెలిచిన నేపథ్యంలో ఆ గెలుపు అధర్మమైనదని.. వచ్చే రోజుల్లో తామే గెలుస్తామని జగన్ ఆ సందేశంలో సంకేతం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
“అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం.” ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 16, 2025