Driver Rayudu Case Latest Updates: సరిగ్గా నెల క్రితం శ్రీకాళహస్తిలో శ్రీనివాసరాయుడు అనే యువకుడి హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ కేసులో శ్రీకాళహస్తి జనసేన బాధ్యురాలు కోటా వినూత, ఆమె భర్త చంద్రబాబు హస్తము ఉందని వార్తలు వినిపించాయి. పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత వారిద్దరు ఈ హత్య కేసులో పాలుపంచుకున్నారని తేలింది. ఈ హత్య శ్రీకాళహస్తిలోనే జరిగినప్పటికీ.. అతడి మృతదేహాన్ని చెన్నై సమీపంలో పడేసిన నేపథ్యంలో.. అక్కడి పోలీసులు చంద్రబాబు, వినూత, ఈ హత్య కేసులో పాల్పంచుకున్న ఇతర వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మొదటి నుంచి కూడా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినుత వద్ద రాయుడు చాలా రోజుల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడని.. ఆమెకు రాజకీయ సలహాదారుగా కూడా ఉన్నాడని వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ సన్నిహితంగా దిగిన ఫోటోలు కూడా మీడియాలో కనిపించాయి. వినుత ప్రైవేట్ గదిలో రాయుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడని.. అందులో జరుగుతున్న దృశ్యాలను ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తికి ఇచ్చాడని.. ఫలితంగా 30 లక్షలు తీసుకున్నాడని వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని.. రాయుడు అలా డబ్బులు తీసుకోలేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. రాయుడు అవివాహితుడు. తన సోదరుడిని చిత్రహింసలకు గురిచేసి అంతం చేశారని రాయుడి సోదరి ఆ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు రాజకీయంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినూతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. మరోవైపు ఈ వ్యవహారాన్ని వైసిపి ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసింది. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కు పాత్ర ఉందన్నట్టుగా కథనాలను ప్రసారం చేసింది. రాయుడు నానమ్మ, సోదరితో ఇంటర్వ్యూ లు నిర్వహించి జనసేన పార్టీని బద్నాం చేసేందుకు విఫల ప్రయత్నం చేసింది.
ఇక ఈ కేసులో వినూతకు బెయిల్ లభించింది. అయితే బెయిల్ ఇచ్చిన కోర్టు అనేక షరతులను వినూతకు విధించింది. కచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు సంతకం చేయాలని.. అనుమతి లేకుండా ప్రాంతం విడిచి వెళ్ళకూడదని సూచించింది. ఈ కేసులో వినూత మాత్రమే బెయిల్ ద్వారా బయటికి వచ్చింది. ఇప్పటికీ ఆమె భర్త చంద్రబాబు, ఈ హత్య కేసులో పాలుపంచుకున్న వ్యక్తులంతా జైల్లోనే ఉన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు బలమైన ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వారికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు ఆమె రాజకీయ జీవితాన్ని ఓ పార్టీకి చెందిన వ్యక్తి పకడ్బందీ ప్రణాళికతో నాశనం చేశాడని వినూత వర్గీయులు అంటున్నారు. ఈ కేసులో పోలీసులకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ వచ్చిందని.. చెన్నై పోలీసులకు కూడా ఏపీ పోలీసులు సహకరించారని.. అందువల్లే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూసాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే బెయిల్ గడువు ముగిసిన తర్వాత వినూత జైలుకు వెళ్తారా.. లేదా ఆమె పలుకుబడి ద్వారా బెయిల్ గడువు పెంచుకుంటారా అనేది చూడాల్సి ఉంది.