వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత సొంత పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నో కేసులను ఎదుర్కొని.. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఏపీ చరిత్రలోనే ఎవరు సాధించలేని అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఏకంగా 151 స్థానాలు గెలుపొంది ఓ ప్రభంజనం సృష్టించారు. ఓ సీఎం కుమారుడిగా రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించిన జగన్.. తనకు ఎదురైన ఇబ్బందులను ఎదుర్కొని పట్టుదలతో సీఎం అయ్యారు. ఒక్కడిగా ప్రారంభమై ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ విజయ పరంపరను కొనసాగించలేకపోయారు. 2024 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు. అంతకుముందు ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన.. ఈ ఎన్నికల్లో ఓటమితో అదే రికార్డును క్రియేట్ చేశారు.సాధారణంగా రాజకీయాల్లో గెలుపోటములు అనేవి సహజం.కానీ కనివిని ఎరుగని రీతిలో విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన..దేశాన్ని తన వైపు చూసుకునేలా చేసుకున్నారు.అదేస్థాయిలో ఓటమి మూటగట్టుకొని మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు సాధించారు.
* జనం..ఆపై ప్రభంజనం
జగన్ అంటే జనం.. జగన్ అంటే ప్రభంజనం అన్న రీతిలో సాగింది ఆయన రాజకీయ జీవితం. తండ్రి వారసత్వంతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు ఈ యువనేత. తొలిసారి ఎంపీగా ఎన్నికై.. తండ్రి మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. 2009లో తొలిసారిగా కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అదే ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే 2009 సెప్టెంబర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించారు. తండ్రి వారసత్వంగా సీఎం పదవిని ఆశించారు జగన్. కానీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం ఆసక్తి చూపలేదు. కొద్దిరోజుల పాటు వేచి చూసిన జగన్.. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని చూసితట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానులు,కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు.
* కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి
కాంగ్రెస్ హై కమాండ్ జగన్ ను అడుగడుగునా అడ్డు తగిలింది. ఓదార్పు యాత్ర చేయవద్దని ఆదేశించింది. చివరకు కాంగ్రెస్ అధిష్టానంతో జగన్ విభేదించారు. తన తల్లి విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎంపీ పదవితో పాటు తన తల్లితో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైస్సార్సీపీ)ని ఏర్పాటు చేశారు. తన తండ్రి ఆశయాలు, సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యం అంటూ ప్రజల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీతో పాటు టిడిపి నుంచి భారీగా ఎమ్మెల్యేలు చేరారు వైసీపీలో. ఈ క్రమంలో తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి 3 ఎన్నికలకు వెళ్లారు జగన్. జగన్ కడప ఎంపీగా రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. అయితే 2012లో సిబిఐ అక్రమాస్తుల కేసులు జగన్ ను అరెస్టు చేసింది. 16 నెలల పాటు జైల్లో ఉంచింది. జగన్ లేకపోయినా విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకుని పార్టీని నడిపించారు. అన్నకు అండగా షర్మిల నిలిచారు.
* 2014లో హోరాహోరీ ఫైట్
జైలు నుంచి విడుదలైన జగన్ దూకుడు పెంచారు. 2014 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేశారు. కానీ ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చింది. అయినా సరే వైసీపీ 67 స్థానాలతో గౌరవప్రదమైన సీట్లను సాధించింది. తెలంగాణలో సైతం మూడు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2014 నుంచి 2019 మధ్య అలుపెరగని పోరాటం చేశారు జగన్. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళం ఎత్తారు. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రత్యక్ష ఆందోళనకు సైతం దిగారు. రాష్ట్రవ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించి హోదా నినాదాన్ని వినిపించారు. 2017లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాదయాత్రను ప్రారంభించారు. నవరత్నాలను ప్రకటించి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 3 వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు. అది ముగిసిన వెంటనే జగన్ సమర శంఖారావం కార్యక్రమంతో హోరెత్తించారు. ప్రజలతో మమేకమై పనిచేశారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో విజయం సాధించారు. 22 మంది ఎంపీలను గెలిపించుకొని జాతీయ స్థాయిలో సైతం చక్రం తిప్పారు జగన్.
* దారుణ పరాజయం
వైసిపి ఐదేళ్ల పాలనలో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. నవరత్నాల్లో వీలైనంతవరకు పథకాలు అమలు చేయగలిగారు. అయితే మూడు రాజధానుల అంశం తెరపైకి రావడం.. అమరావతిని నిర్వీర్యం చేయడం.. అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఉండేది. అయితేప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నాం కాబట్టి.. వారంతా మరోసారి ఆశీర్వదిస్తారని జగన్ భావించారు. కానీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వ్యక్తం అయింది. పైగా మూడు పార్టీలు కూటమి కట్టాయి. అయితే వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. 2019లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఐదేళ్లు తిరిగేసరికి 140 స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఓటమితో వైసిపి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట నడిచిన చాలామంది నేతలు దూరమయ్యారు.అయినా సరే ధైర్యంతో, మొక్కవోని దీక్షతో జగన్ ప్రజల బాట పడుతున్నారు. తనకు నాయకులతో పనిలేదని, ప్రజల అండ ఉంటే మరోసారి వైసీపీ విజయ తీరాల వైపు చేర్చుతానని జగన్ అభిప్రాయపడుతున్నారు. 2009లో తన తల్లి, తాను మాత్రమే బయటకు వచ్చానని.. తరువాతే నాయకులు వచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోసారి అదే చరిత్ర రిపీట్ అవుతుందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికైతే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఓ రాజకీయ వారసుడు అనతి కాలంలోనే ఒంటరిగా అధికారాన్ని చేజిక్కించుకోవడం అరుదు. కానీ దానిని చేసి చూపించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు వైసీపీకి ఎదురైన సంక్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.