https://oktelugu.com/

PVG Raju : రాజు అంటే అలా ఉండాలి అనేలా.. ప్రజల కోసం సర్వం త్యాగం చేసి.. కోటనే ఖాళీ చేసిన ‘పూసపాటి రాజు’ కథ!

సాధారణంగా రాజులు అంటే దర్పం ప్రదర్శిస్తారు. భారీ అట్టహాసంతో గడుపుతారు. కానీ అందుకు విజయనగరంరాజులు అతీతం.

Written By:
  • Dharma
  • , Updated On : July 28, 2024 / 05:37 PM IST

    PVG Raju

    Follow us on

    PVG Raju :  ‘వీడు ఎక్కడున్నా రాజే రా’ బాహుబలి చిత్రంలో బలమైన డైలాగు ఇది. కథానాయకుడి బలాన్ని చెప్పేందుకు విలన్ తండ్రి భిజ్జలదేవ ఈ మాట అంటాడు… కానీ ఒక ప్రాంతంలో మాత్రం రాజును చూస్తే మాత్రం అంతా భిన్నం. సామాన్య ప్రజలతో మమేకమవుతారు. సామాన్య జీవితం అనుభవిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు తాము ఒక సంస్థానాధీశులమన్న విషయాన్ని వారు మరిచిపోతారు. వారే విజయనగరం సంస్థానాధీశులు. రాజు అంటేనే చుట్టూ మందీ మార్బలం. ఖరీదైన వాహనాలు. నివాసం ఉండేందుకు భవంతులు. విలాసంలో భాగంగా వన్యప్రాణుల వేట.. ఇలా ఒకటేమిటి అన్ని రకాల దర్పాలు వారికి సొంతం. కానీ దీనికి భిన్నమైన సామాన్య జీవితాన్ని అనుభవించారు విజయనగరం సంస్థానాధీశుడు పూసపాటి విజయరామ గజపతిరాజు అలియాస్ పివిజి రాజు. తండ్రి అనూహ్య మరణంతో 21 సంవత్సరాలకే తొమ్మిదో తరం రాజుగా పివిజి రాజు బాధ్యతలు స్వీకరించారు. పూసపాటి వంశంలో పట్టాభిషిక్తుడైన చిట్టచివరి మహారాజు కూడా ఈయనే. ఈయన పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా అతిరథ మహారథులంతా తరలివచ్చారు. 1945 ఆగస్టు 24న జరిగిన ఈ ఉత్సవంలో పండిట్ బిస్మిల్లా ఖాన్ షెహనాయి వాయించారంటే విజయనగరం మహారాజుల వైభవం ఇట్టే తెలిసిపోతుంది. తండ్రి అకాల మరణంతో రాజుగా బాధ్యతలు స్వీకరించిన పివిజి రాజు ఉన్నత చదువులకు అమెరికా వెళ్లారు. తాను ఒక రాజు అయినా సామాన్యుడిలాగే అమెరికాలో గడిపారు. సమాజాన్ని అర్థం చేసుకోవడం కోసం అక్కడ హోటల్లో పనిచేశారు. అక్కడే ఉండగా బొంబాయి నుంచి వచ్చిన కుసుమ్ మద్గవ్కర్ తో వివాహం జరిగింది. ప్రేమ కాస్త పెళ్లికి దారి తీసింది. 1949లో వారి వివాహం అమెరికాలోనే జరిగింది. అక్కడి నుంచి 1950లో భారత్ తిరిగి వచ్చారు. అప్పటికే స్వతంత్ర దేశంగా మారింది భారత్. వెళ్లేటప్పుడు మహారాజును.. ఇప్పుడు మామూలు మనిషిని అని సరదాగా వ్యాఖ్యానించారు పివిజి. అయితే అది మనసు లోతుల్లోంచి వచ్చినది అని నిరూపించారు. సామాన్య జీవితానికే పెద్దపీట వేశారు. ప్రజల కోసం తన ఆస్తిని వదులుకున్నారు. విద్యాసంస్థల కోసం విజయనగరంలోని రాజకోటను, ఉత్తరాంధ్రలో విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చారు. విజయనగరం సంస్థానానికి ఒడిస్సా నుంచి మచిలీపట్నం వరకు ఉన్న ఆస్తులను పరిహారం ఆశించకుండానే ప్రభుత్వానికి దానం చేసిన మహనీయుడు పివిజి రాజు.

    తన పిల్లలతో PVG Raju

    * సోషలిస్ట్ భావాలు
    ఒక మహారాజు సోషలిస్ట్ భావాలను ఎంచుకోవడం అసమాన్యం. భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన తర్వాత పివిజి రాజు రాజకీయాల్లో అడుగుపెట్టారు. అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ సోషలిస్ట్ పార్టీని ఎంచుకున్నారు. జయప్రకాశ్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్ పట్వర్ధన్, జేబీ కృపాలని, అశోక్ మెహతా లాంటి సోషలిస్టు నేతల ప్రభావం పి వి జి పై పడింది. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి ఎంపికయ్యారు పివిజి రాజు. ఆపై అప్పటి ప్రధాని నెహ్రూ ఒత్తిడి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ సీటుకు రాజీనామా చేసి ఉప ఎన్నిక ద్వారా ఏపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సంజీవయ్య ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా, నీలం సంజీవరెడ్డి సర్కార్లో విద్యాశాఖ మంత్రిగా వెలుగు వెలిగారు.

    ఇందిరాగాంధీతో pvg raju

    * సామాన్యుల కోసం
    రాజు అంటే దర్పం.. రాజు అంటే రాజసం.. రాజు అంటే ఆధిపత్యం.. కానీ వీటన్నింటికీ అతీతం విజయనగరం సంస్థానం. అక్కడ అంతా భిన్నం. ఇప్పటికీ ఆ జిల్లాలో సామాన్యులు రాజావారి కుటుంబంతో అనుబంధం కొనసాగిస్తారు. చాలా సులువుగా కలుసుకోగలుగుతారు. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టే క్రమంలో పివిజి రాజు వారసులు అశోక్ గజపతిరాజు, అదితి గజపతిరాజు సామాన్యులతో మమేకమయ్యే తీరు అభినందనలు అందుకుంటుంది.

    నాటి ప్రధాని నెహ్రూతో PVG Raju

    * చివరి జీవితం ఆధ్యాత్మికంలోనే
    తన జీవితంలో చివరి రోజుల్లో ఆధ్యాత్మిక చింతనలో గడిపారు. 60 సంవత్సరాల తర్వాత ఆస్తులు, అంతస్తులు, భవంతులు విడిచిపెట్టారు. ఆశ్రమ జీవితాన్ని స్వీకరించారు. సింహాచలం గోశాలలో దైవచింతనలో గడిపారు. 1964లో భాక్రనంగల్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళినప్పుడు పి వి జి రాజు కారు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడ్డారు. మూడు నెలలు పాటు కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. 1971 నుంచి 1984 వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. సింహాచలం దేవస్థానం అంటే వల్లమానిన అభిమానం పివిజి రాజుకు. అక్కడ గోశాలలో దైవచింతనలో ఉండగానే 1995 నవంబర్ 14న కన్నుమూశారు.

    భార్యతో PVG Raju

    * ప్రజా సంక్షేమానికి పెద్దపీట
    పివిజి రాజు ప్రతి నిర్ణయం వెనుక ప్రజా సంక్షేమం ఉండేది. తన తండ్రి అలక్ నారాయణ పేరిట మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్.. మానస ట్రస్టును ఏర్పాటు చేశారు. తన వంశపారంపర్యంగా వచ్చిన 15 వేల ఎకరాల ఆస్తులను ఈ ట్రస్టుకు రాసేశారు. 300 సంవత్సరాలుగా తమ కుటుంబ ఆధీనంలో ఉన్న విజయనగరం కోటను ట్రస్టుకు ఇచ్చేశారు. మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ 1962లో మహారాజ మహిళా కళాశాలను ప్రారంభించారు. వేలాదిమందికి విద్యాబుద్ధులు అందించింది ఆ సంస్థ. మానస ట్రస్ట్ పరిధిలో 105 దేవాలయాలు, 14,800 ఎకరాల భూములు, 13 విద్యాసంస్థలు ఉన్నాయి. విద్యాసంస్థల కోసం బ్యాంకుల్లో 124 కోట్లు డిపాజిట్లు చేశారు. ఏడాదికి ఏడు కోట్ల వరకు ట్రస్ట్ నుంచి సంస్థలకు అందుతాయి. ప్రస్తుతం మాన్సాస్ విద్యాసంస్థల్లో 700 మంది సిబ్బంది, పదివేల 500 మంది విద్యార్థులు ఉన్నారు. ఈయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. రెండో కుమారుడు అశోక్ గజపతిరాజు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు. టిడిపి ఆవిర్భావ సభ్యుడు కూడా. పి వి జి రాజు ఆశయాలను, ఆశలను కొనసాగిస్తున్నారు వారసులు. ఆనంద గజపతిరాజు కనుమూయగా.. చిన్న కుమారుడు అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్నికల్లో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికీ తండ్రి మాదిరిగా అశోక్ కూడా సామాన్య జీవితాన్ని కొనసాగిస్తుండడం విశేషం.

    బ్రిటన్ రాణితో PVG Raju