Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందింది. మహిళా యువ షూటర్ మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో భారత్ కు కాంస్య పతకకం సాధించింది. షూటర్ మను భాకర్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో చాటెరోక్స్ షూటింగ్ సెంటర్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో కాంస్యం సాధించి భారతదేశానికి మొదటి పతకాన్ని అందించాడు. ఈ పతకం ద్వారా ఒలింపిక్ గేమ్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా భాకర్ చరిత్ర సృష్టించారు. కాగా అర్జున్ బాబుటా, రమితా జిందాల్ కూడా పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌కు అర్హత సాధించడం ద్వారా భారత్ పతక ఆశలను పెంచారు. అంతకుముందు, పురుషుల సింగిల్ స్కల్స్‌లో రోయర్ బల్‌రాజ్ పన్వార్ రెపెచేజ్ రౌండ్‌లో రెండవ స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. మను ఫైనల్‌లో 221.7 పాయింట్లతో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యే జిన్ ఒలింపిక్ రికార్డు స్కోరు 243.2 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది. మరో కొరియా క్రీడాకారిణి కి యెజిన్ 241.3 పాయింట్లతో రజతం కైవసం చేసుకున్నాడు.
*మను బాకర్ నేపథ్యం
మను బాకర్ హర్యానా రాష్ట్రంలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన గోరియా అనే గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్ కాగా.. తల్లి స్కూలు ప్రిన్సిపాల్ గా పనిచేస్తోంది. మను బాకర్ చిన్నప్పటి నుంచి అన్ని క్రీడల్లో ప్రతిభ చాటేది. షూటింగ్ తోపాటు బాక్సింగ్, అథ్లెటిక్స్, స్కేటింగ్, జూడో కరాటే క్రీడల్లో పాల్గొనేది. చిన్నవయసులో గానే షూటింగ్ లో రాణించిన మనుబాకర్ కు కెరీర్ ప్రారంభంలో పిస్టల్ తో ప్రజల మధ్య ప్రయాణించడం అనుకోని కష్టాలను తెచ్చిపెట్టింది. మైనర్ కావడంతో పిస్టల్ తీసుకొని ప్రయాణించడం చట్టరీత్యానేరం అని ఆమెను పోలీసులు ఆపేసేవారు.
దీంతో కుమార్తె షూటింగ్ పోటీల్లో పాల్గొనడంలో సహాయపడేందుకు ఏకంగా మను భాకర్ తండ్రి ఏకంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టడం గమనార్హం. కూతురు కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసి ఆమె కెరీర్ ను మలిచాడు మను బాకర్ తండ్రి. అందుకే అత్యంత ఖరీదైన తుపాకులతో ఆడే ఈ ఆటను ఆడగలిగానంటే తన కుటుంబం అందించిన సహాయ సహకారాలేనని మను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.
-కెరీర్ ప్రస్థానం..
2012 ఒలింపిక్స్ తర్వాత నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఇండియా , స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యువ క్రీడాకారుల కోసం మొదలుపెట్టిన ఇండియాస్ ఇన్వెస్ట్ మెంట్ ఇన్ షూటింగ్ ప్రోగ్రాం ద్వారా ‘మను బేకర్’ను గుర్తించి ట్రైనింగ్ ఇచ్చింది. భారత అత్యుత్తమ షూటర్ జస్పాల్ రాణా ద్వారా మను బేకర్ కు శిక్షణ ఇప్పించి రాటు దేల్చింది.
* 2017లో కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్స్ షిప్ లో మను బాకర్ ఏకంగా 9 బంగారు పతకాలు సాధించి జాతీయ రికార్డ్ బద్దలుకొట్టింది.
*2017లో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్ లో కూడా మను బాకర్ రజత పతకం సాధించింది.
*2018లో మెక్సికోలో జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో రెండు సార్లు చాంపియన్ అలెజాండ్రా జావ్లాను ఓడించి అతి చిన్న వయసులో బంగారు పతకం సాధించిన తొలి భారతీయురాలిగా మను బాకర్ రికార్డ్ నెలకొల్పింది.
*2018లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ లో మను బాకర్ రెండు స్వర్ణాలు సాధించింది.
*కామన్ వెల్త్ గ్రేమ్స్ లోనూ బంగారం పతకం సాధించింది. 16 ఏళ్ల వయసులోనే మను మాకర్ ఈ రికార్డ్ సాధించడం విశేషం.
*2020 ఆగస్టులో వర్చువల్ ఈవెంట్ ద్వారా రాష్ట్రపతి కోవింద్ నుంచి అర్జున అవార్డ్ అందుకుంది.
పారిస్ ఒలంపిక్స్ లో తొలి పతకాన్ని అందించడం ద్వారా యువ షూటర్ మను బాకర్ మన పతకాల రేసును ప్రారంభించారు. మరి ఈ ఒలంపిక్స్ లో మన ఆటగాళ్లు ఎన్ని పతకాలు సాధిస్తారన్నది వేచిచూడాలి.
Manu Bhaker becomes the first Indian woman to win a medal in shooting at the #Olympics pic.twitter.com/pvMCkESHEE
— R A T N I S H (@LoyalSachinFan) July 28, 2024