TTD Laddu Controversy: తిరుమల( Tirumala) లడ్డూ వివాదానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. అయితే ఈ విచారణలో కళ్ళు బైర్లు కమ్మేలా నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసు విచారణలో సిట్ వేగం పెంచింది. అరెస్టు చేసిన నలుగురు నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది ప్రత్యేక దర్యాప్తు బృందం. బోలె బాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈవో అపూర్వ విజయకాంత్ చావ్లా, ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖరన్ లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఈ కల్తీ నెయ్యి కేసులో అరెస్టు చేసిన నలుగురిని ఏ2 నుంచి ఏ5 గా చేర్చింది. అలాగే ఏ 8గా వైష్ణవి డైరీ సీఈవో సబల్ సమీముల్లా ఖాన్ ను పేర్కొంది. అయితే నిందితులు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మొబైల్ లను స్విచ్ ఆఫ్ చేశారు. కొత్త ఫోన్లు కొనుగోలు చేసి డిజిటల్ ఆధారాలను నాశనం చేయాలని ప్రయత్నించారని అధికారులు చెబుతున్నారు.
* బోలె బాబా కంపెనీ..
ప్రధానంగా 2019 తర్వాత టీటీడీకి( TTD ) నెయ్యి సరఫరాకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టింది ప్రత్యేక దర్యాప్తు బృందం. 2019లోనే టీటీడీకి బోలె బాబా డైరీ నెయ్యి సరఫరా చేసినట్టు సిట్ గుర్తించింది. 2022లో ఈ సంస్థ ట్యాంకర్లను టిటిడి తిరస్కరించినప్పటికీ.. అటు తరువాత వైష్ణవి డైరీ పేరుతో మళ్లీ సరఫరా కొనసాగించినట్లు విచారణలో తేలింది. దీనినే రిపోర్టులో స్పష్టం చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది నేతల ప్రమేయం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పటివరకు అటువంటి నేతల పేర్లు దర్యాప్తు బృందం బయట పెట్టలేదు.
* ఒప్పందం ఒకరితో.. సరఫరా ఇంకొందరితో తమిళనాడుకు( Tamil Nadu ) చెందిన ఏఆర్ డైరీ సంస్థ నెయ్యి సరఫరాకు ఒప్పందాన్ని పొందింది. కానీ ఉత్తరప్రదేశ్ కి చెందిన బోలె బాబా ఆర్గానిక్ డైరీ..తిరుపతికి చెందిన వైష్ణవి డైరీ ద్వారా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు నిర్ధారించారు సిట్ అధికారులు. అసలైన ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువగా చూపించి ఏఆర్ డైరీ దక్కించుకున్నట్లు తెలిపారు. వార్షిక పాలు, నెయ్యి ఉత్పత్తిని తప్పుడు లెక్కలతో చూపించి టెండర్ సాధించినట్లు స్పష్టం చేశారు. మొత్తం 945.6 మెట్రిక్ టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా.. 3072 మెట్రిక్ టన్నులుగా సంస్థ చూపినట్లు గుర్తించారు. అయితే టెండర్ సాధించేందుకు బోలె బాబా డైరీ నుంచి ఏఆర్ డైరీకి 70 లక్షల రూపాయలు బదిలీ జరిగినట్లు గుర్తించారు అధికారులు. టెండర్ కోసం కోసం అవసరమైన 51 లక్షల రూపాయల డిపాజిట్ మొత్తాన్ని కూడా బోలె బాబా సంస్థ చెల్లించిందని కూడా గుర్తించగలిగారు.
* తక్కువ ధరకు టెండర్ తోనే
నెయ్యి(ghee )ధర కంటే తక్కువ ధరకు టెండర్ దక్కించుకోవడంతోనే.. కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించినట్లు తేలింది. 2024లో ఏఆర్ డైరీ కి టెండర్ దక్కింది. కిలోగ్రామ్ నెయ్యి రూ.319.80 లకు అందించేందుకు టెండర్ దక్కించుకుంది. అయితే అసలు నెయ్యి ధరకు ఇది చాలా తక్కువ. ఇక్కడే కల్తీ నెయ్యి సరఫరాకు బీజం పడినట్లు తెలుస్తోంది. టెండర్ దాఖలు సమయంలో.. 2024 మార్చి 12న చెన్నై నుంచి పిపి శ్రీనివాసన్ తప్పుడు డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారు. దీనిని డైరెక్టర్ పొమిల్ జైన్ సూచనల మేరకు చేసినట్లు తెలిపారు. ఏఆర్ డైరీ కి ప్రతి కిలో నెయ్యికి 2.75 నుంచి మూడు రూపాయల వరకు కమిషన్ ఇస్తామంటూ వైష్ణవి, బోలె బాబా డైరీలు రహస్య ఒప్పందం చేసుకున్నట్లు ప్రత్యేక కమిటీ తన రిపోర్ట్ లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి మున్ముందు అరెస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.