AP Liquor Price : ఏపీలో( Andhra Pradesh) కూటమి మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న ధరలను సవరించింది ప్రభుత్వం. దీంతో లిక్కర్ ధరలు 15% పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యాన్ని మూడు కేటగిరీలుగా సరఫరా చేస్తున్నారు. ఇందులో ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్లుగా సరఫరా చేస్తున్నారు. ఇటీవల మద్యం వ్యాపారుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అమ్మకాలపై మార్జిన్ ను 14.5 నుంచి 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో అన్ని కేటగిరీల్లో 15% ధరలు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం. దీంతో అన్ని మద్యం బాటిళ్ల పై ఇప్పటివరకు ఉన్న ధరలు పెరగనున్నాయి. దీంతో మందుబాబులపై అదనపు భారం పడనుంది.
* మారిన మద్యం పాలసీ
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది. అప్పటివరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రైవేటు మద్యం దుకాణాలను తిరిగి తెరిచింది. రాష్ట్రవ్యాప్తంగా 3,336 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. అయితే పోటా పోటీగా మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకున్నారు అన్ని వర్గాల ప్రజలు. అయితే అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవడంతో వారిలో ఒక రకమైన ఆందోళన కనిపించింది. తమ కమీషన్ పెంచకుంటే అమ్మకాలు నిలిపివేస్తామంటూ ప్రభుత్వానికి వారు అల్టిమేట్ జారీ చేశారు. దీంతో ఈ డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 20% మార్జిన్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెంచిన ధరలు ఈరోజు నుంచి అమలు కానున్నాయి.
* ఫుల్ క్లారిటీ
మరోవైపు ఈ అంశంపై ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్( Nishant Kumar ) స్పందించారు. మద్యం ధరల పెంపు పై స్పష్టత ఇచ్చారు. ప్రతి బాటిల్ పై పది రూపాయలు మాత్రమే ధర పెరిగిందని… ఇందులో బ్రాండెడ్ మద్యంతో సంబంధం లేదని.. అన్ని బ్రాండ్లపై కేవలం పది రూపాయలు మాత్రమే పెంచినట్లు చెప్పుకొచ్చారు. కొంతమంది 15 నుంచి 20 రూపాయలు పెంచాలని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇది నిజం కాదన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాజా ధరల వివరాలను అన్ని షాపుల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక పేరుతో పాటు 99 రూపాయల మద్యం బ్రాండ్ ధరల పెంపు ఉండదని క్లారిటీ ఇచ్చారు.
* ఎన్నికల్లో హామీ మేరకు
తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యంతో పాటు తక్కువ ధరకు అందిస్తామని చంద్రబాబు( Chandrababu) హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. అన్ని రకాల బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి ఇచ్చారు. అయితే 20% మార్జిన్ ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. అయితే 14.5% మాత్రమే ఇవ్వడంతో వ్యాపారులు ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు. తమ కమీ షన్ పెంచాల్సిందేనని తేల్చి చెప్పారు. పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే మార్జిన్ పెరిగిన నేపథ్యంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.