NTR Birth Anniversary: తెలుగుదేశం పార్టీ రాజకీయాల కోసం పుట్టిందే కాదు. తెలుగు సమాజంలో సరికొత్త విప్లవం ఆ పార్టీ సొంతం. ఢిల్లీ పెత్తనాన్ని సహించలేక నందమూరి తారక రామారావు 1982 మార్చి 27న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకు రాగలిగారు. దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ చరిత్రను తిరగరాసారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు పురుడుబోసుకునేందుకు కారణమయ్యారు. నాలుగు దశాబ్దాల టిడిపి చరిత్రలో ఎత్తు పల్లాలు ఉన్నాయి. సంక్షోభాలు సైతం ఎదురయ్యాయి. వాటన్నింటినీ పార్టీ అధిగమించిందంటే ఎన్టీఆర్ వేసిన పునాది కారణం.
కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం నిమ్మకూరులో పుట్టారు నందమూరి తారక రామారావు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన తొలుత ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే తనలో ఉన్న కళాతృష్ణను బయటపెట్టారు. రంగస్థల కళాకారుడిగా అడుగుపెట్టారు. సినీ ప్రపంచంలో రాణించాలని బలమైన సంకల్పంతో మద్రాస్ వెళ్లారు. ఎన్నో రకాల ఇబ్బందులను అధిగమించి సినిమా ఛాన్స్ దక్కించుకున్నారు. పౌరాణిక చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో అలరించారు. నవరస నటసార్వభౌముడుగా గుర్తింపు సాధించారు. తెలుగు సినీ పరిశ్రమలు వన్ అండ్ ఓన్లీ లెజెండ్రీ గా అవతరించారు. సినీ రంగంలో ఉన్న సమయంలోనే.. దివిసీమ ఉప్పెన ఏపీని అల్లకల్లోలం చేసింది. వేలాది మందిని జల సమాధి చేసింది. నిరాశ్రయులుగా మిగిలిన వేలాదిమంది కట్టు బట్టలతో మిగిలారు. అటువంటి వారి కోసం ఎన్టీఆర్ జోలి పట్టారు. ఆయన పిలుపుమేరకు సినీ పరిశ్రమ తరలివచ్చింది.
అయితే ఏపీ ప్రజల కష్టాలు తీరాలంటే.. రాజ్యాధికారం తెలుగువారికి రావాలని.. కాంగ్రెస్ ఢిల్లీ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి పదవులు పోవాలని బలంగా సంకల్పించారు నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీని స్థాపించి… అప్పటివరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బీసీలకు అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్. అలా అవకాశం చిక్కించుకున్న వారే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన నాయకులు. సంక్షేమాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది ఎన్టీఆర్. రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేదల్లో దేవుడయ్యారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాలకు భరోసా కల్పించారు. మహిళలకు సమానంగా ఆస్తి హక్కును కల్పించిన మహనీయుడు ఆయన.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్లిన మొదటి నాయకుడు ఎన్టీఆర్. దేశంలో కూటమి ప్రభుత్వాలు కట్టడంలో కూడా ఆయనదే కీలక పాత్ర. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసింది కూడా ఆయనే. అయితే అటువంటి ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఇబ్బందులు పడటం తీరని లోటు. సొంత కుటుంబ సభ్యులు ఎదురు తిరగడం.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు అండగా నిలవడం.. 1995లో టిడిపిలో సంక్షోభం.. ఎన్టీఆర్ నుంచి పార్టీని హస్తగతం చేసుకోవడం.. ఇవన్నీ ఎన్టీఆర్ చివరి రోజుల్లో మనస్థాపానికి గురిచేసిన అంశాలే. ఆ బెంగతోనే ఆయన చనిపోయారని ఇప్పటికీ చెబుతుంటారు. అయితే ఒకటి మాత్రం నిజం.. తెలుగు సమాజంలో నందమూరి తారక రామారావు ది ప్రత్యేక స్థానం. అది ఎవరూ చెరపలేని.. జరగరాని ముద్ర. దటీజ్ ఎన్టీఆర్.