Roja: రోజాపై పడిపోయిన ఈనాడు.. ఏంటి కథ?

2014 ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధంగా రోజా బయటపడ్డారు. కేవలం 800 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందారు. రెండోసారి సైతం 2000 ఓట్లతోనే విజయం సాధించగలిగారు.

Written By: Dharma, Updated On : April 19, 2024 6:31 pm

Roja

Follow us on

Roja: ఏపీలో సెలబ్రిటీ నియోజకవర్గాల్లో నగిరి ఒకటి. అక్కడ మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తుండడమే కారణం. గత రెండు ఎన్నికల్లో వైసీపీ తరఫున నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలుపొందారు. ఈసారి ఆమె గెలుపు కష్టమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సొంత పార్టీ శ్రేణులే ఆమెను ఓడిస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి.. ఆమె వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఆమె టికెట్ ను సైతం మార్చుతారని మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ జగన్ మాత్రం రోజాపై నమ్మకం పెట్టుకున్నారు. వైసీపీ తరఫున మూడోసారి నగిరి టిక్కెట్ ను కేటాయించారు. అయితే ఆమెపై ఈనాడులో ప్రత్యేక కథనం రావడం గమనార్హం. ఈనాడుతో రోజాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొన్నటి వరకు జబర్దస్త్ జడ్జిగా కూడా వ్యవహరించారు. ప్రత్యేక కార్యక్రమాలకు సైతం అతిథిగా రోజా వెళుతున్నారు. ఈ క్రమంలో ఆమె విషయంలో చూసీ చూడనట్టుగా వెళ్లేవారు. కానీ ఎన్నికల ముంగిట ఆవిడ అక్రమాలు, కుటుంబ సభ్యుల అవినీతి అంటూ ఈనాడులో పతాక శీర్షికన కథనం రావడం విశేషం.

2014 ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధంగా రోజా బయటపడ్డారు. కేవలం 800 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందారు. రెండోసారి సైతం 2000 ఓట్లతోనే విజయం సాధించగలిగారు. అయితే ఆమెకు సొంత పార్టీ శ్రేణులతో సమన్వయం లేదు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వ్యతిరేక వర్గం ఎక్కువగా ఉంది. ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరిక కూడా వచ్చింది. అయినా సరే ఎందుకు వచ్చింది గొడవ అంటూ జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా రోజా సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన అవినీతి, దోపిడీ గురించి ప్రత్యేక కథనం ఈనాడులో రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాడు అప్పుల నగరి.. నేడు సిరుల ఝరి అన్న కథనం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

చిత్తూరులో సెలబ్రిటీ ప్రజా ప్రతినిధి దోపిడీ పర్వం ఇది అంటూ సాగిన ఈ కథనం.. కుటుంబ సభ్యుల అవినీతి ప్రమేయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భర్త, సోదరులకు మండలాల వారీగా కట్టబెట్టేసారని.. మట్టి, ఇసుక అక్రమ రవాణా తో కోట్లు దండుకున్నారని.. అప్పుల నుంచి పుట్టినరోజున బెంజు కొనే స్థాయికి ఎదిగారంటూ సాగిన ఈ కథనం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వైరల్ గా మారింది. గత ఐదు సంవత్సరాలుగా రోజాపై ఈ స్థాయిలో ఈనాడులో కథనం రావడం ఇదే తొలిసారి.

రోజా సుదీర్ఘకాలం ఈటీవీలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. వైసీపీలో చేరినా, ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటీవీతో అనుబంధాన్ని మాత్రం వదులుకోలేదు. పైగా ప్రత్యేక కార్యక్రమాల హోస్ట్ గా కూడా వ్యవహరించారు. బహుశా ఈ కోణంలోనే ఈనాడు మంత్రి రోజా విషయంలో కలుగజేసుకోలేదు. అయితే ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకం. అందుకే ఈనాడు వ్యూహం ప్రకారం కీలక నేతల నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. అందులో నగిరి అతీతం కాదని తేలింది. మొత్తానికైతే అటు తిరిగి ఇటు తిరిగి రోజాపై ఈనాడు పడడం హాట్ టాపిక్ గా మారింది.