Speaker Tammineni Sitaram: సరిగ్గా ఎన్నికల ముంగిట పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వెలుగులోకి వచ్చింది. 8 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. రాతపూర్వక స్పందన కోసం ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి స్పందన బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇన్నాళ్లు ఊరుకున్న పార్టీలు ఉన్నపలంగా చర్యలకు డిమాండ్ చేయడం వెనుక.. రాజ్యసభ ఎన్నికల వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు స్థానాలు వాస్తవంగా వైసిపి దక్కించుకునే అవకాశం ఉంది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం రాజ్యసభ స్థానాలకు పోటీపడే అవకాశం ఉంది. అదే జరిగితే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వెలుగులోకి వచ్చింది. టిడిపిలోకి వెళ్లిన ఆ నలుగురిపై వైసీపీ.. వైసీపీలోకి వెళ్లిన ఆ నలుగురిపై టిడిపి పరస్పరం స్పీకర్ కు ఫిర్యాదు చేశాయి. దీంతో స్పీకర్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది.
గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో, టిడిపి 23, జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. అయితే టిడిపి నుంచి వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరి వైసిపి పంచన చేరారు. గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారని ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిలపై వైసిపి హై కమాండ్ వేటు వేసింది. అయితే ఈ 8 మంది పై అనర్హత వేటు వేయాలని వైసిపి, టిడిపి వేర్వేరుగా స్పీకర్ కు ఫిర్యాదులు చేశాయి. ఈ తరుణంలోనే వారికి స్పీకర్ నోటీసులు పంపించారు.
అయితే వైసిపి వ్యూహాత్మకంగానే దీనిని అమలు చేస్తుందన్న టాక్ నడుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో మూడు స్థానాలను కైవసం చేసుకోవాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఒక్కో రాజ్యసభ దక్కించుకోవాలంటే 49 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన వైసీపీకి అవసరమైన సంఖ్యాబలం ఉంది. కానీ గత మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ఇలా అంచనా వేసుకుని దెబ్బతింది. మరోసారి ఆ పరిస్థితి రాకూడదని జగన్ భావిస్తున్నారు. కానీ అభ్యర్థుల మార్పుతో చాలామంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్తున్నారు. అటువంటి వారికి అనర్హత వేటు ద్వారా భయపెట్టి నియంత్రణలోకి తెచ్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. మరోవైపు టిడిపిలో చేరికలకు అడ్డుకట్ట వేయాలని కూడా చూస్తున్నారు. ద్విముఖ వ్యూహంతో జగన్ ముందుకు సాగుతుండడం విశేషం.
ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదింప చేశారు. టిడిపిలో చేరిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే టిడిపి బలం తగ్గిపోతుంది. అదే సమయంలో వైసీపీ నుంచి చేరబోయే ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వర్తిస్తుందని భయపెడితే.. వారు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. తద్వారా మూడు రాజ్యసభ స్థానాలను చాలా సులువుగా గెలుచుకోవాలని జగన్ భావిస్తున్నారు. అవసరమైతే ఆర్థికంగా బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా ఎమ్మెల్యేలను నియంత్రించాలని చూస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.