Home Minister Anitha: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓ కేసుకు సంబంధించి అనిత తరపు న్యాయవాది వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.సరి చేసుకోవాలని సూచించింది. తనపై విశాఖ 7వ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో పెట్టిన కేసు ప్రొసీడింగ్స్ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు అనిత. ఫిర్యాదుదారుడుతో రాజీ చేసుకున్నానని.. అందుకే కేసు కొట్టి వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాజీ అంటే ఏంటని.. అందుకు తగ్గట్టు ఆధారాలు చూపించాలి కదా అంటూ అనిత తరపు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేశారు న్యాయమూర్తులు. ఆ రాజీకి సంబంధించి పూర్తి ఆధారాలు, వివరాలు సమర్పిస్తే కానీ తాము స్పందించలేమని చెబుతూ విచారణను వాయిదా వేసింది హైకోర్టు. దీంతో హోం మంత్రి అనితకు షాక్ తగిలినట్లు అయ్యింది.
* చెక్ బౌన్స్ కేసు
హోంమంత్రి అనిత తన అవసరాల కోసం శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద 70 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లింపు విషయంలో వివాదం ఏర్పడింది. దీంతో బాధితుడు విశాఖ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేశారు. తన వద్ద డబ్బులు తీసుకుని అనిత ఎగవేశారని అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శ్రీనివాసరావు. అయితే ఆ కోర్టులో ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని కోరుతూ అనిత హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈరోజు కోర్టు విచారణ చేపట్టింది. బాధితుడు శ్రీనివాసరావు తో స్వయంగా మాట్లాడింది. అనితతో రాజీ కుదుర్చుకున్నారా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అయితే తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారని అనుకుంటున్నాను అని శ్రీనివాసరావు బదులిచ్చారు. తనకు వారి చుట్టూ తిరిగే ఓపిక లేదని కూడా చెప్పుకొచ్చారు. అందుకే రాజీ అనగానే సరేనన్నానని బాధితుడు కోర్టుకు విన్నవించాడు.
* ఈ నెల 10 కి వాయిదా
బాధితుడు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ కేసును కొట్టివేయాలని ఆదేశాలు ఇవ్వాలని అనిత తరపు న్యాయవాది సతీష్ కోరారు. చెక్ బౌన్స్ కేసును కొనసాగించడానికి వీలులేదని.. భవిష్యత్తులో కూడా శ్రీనివాసరావు ఎలాంటి కేసులు వేయడానికి వీల్లేదని వాదించారు. దీనిపై కోర్టు అభ్యంతరం తెలిపింది. అది రాజీ ఎలా అవుతుందని ప్రశ్నించింది. రాజీ అంటే ఇరుపక్షాల మధ్య ఒప్పందం జరగాలని.. అలా జరిగే ఒప్పందం చూపించాలని కోరింది. ఆ రాజీకి సంబంధించి అన్ని వివరాలను తమ ముందు ఉంచాలని హోం మంత్రి అనిత న్యాయవాదికి సూచించింది కోర్టు. ఈ కేసు విచారణను ఈ నెల 10 కి వాయిదా వేసింది. దీంతో హోం మంత్రి అనితకు షాక్ తగిలినట్లు అయ్యింది