YS Sharmila: ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మిగిలిన వారే ఒకే గూటికి చేరుతున్నారు. నిన్నటికి నిన్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలుసుకున్న సంగతి తెలిసిందే. అది మరవకముందే వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ సీఎం సోదరి వైయస్ షర్మిల నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ శిబిరంలో కలకలం చోటుచేసుకుంది. నిన్న ప్రశాంత్ కిషోర్, నేడు సోదరి షర్మిల జగన్ కు జలక్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలు పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
గత ఎన్నికల్లో జగన్ కు అనుకూలంగా పనిచేసిన వారంతా.. ఇప్పుడు ప్రత్యర్థి చంద్రబాబును కలవడం విశేషం. 2019 ఎన్నికల్లో జగన్కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి.. నాడు వైసిపి విజయంలో కీలక భూమిక పోషించిన పీకే చంద్రబాబును కలవడం మాత్రం ఒక సంచలనమే. కలిసి పని చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరించడం వైసిపి వర్గాల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. మొన్నటి వరకు తమకు వ్యూహాలు అందించిన వ్యక్తి ఇప్పుడు.. ప్రత్యర్థి చెంతకు చేరడం మాత్రం వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఈ షాక్ లో ఉండగానే
జగన్ సోదరి షర్మిల నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా గిఫ్ట్ పంపినందుకు నారా లోకేష్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ” క్రిస్మస్ గిఫ్ట్స్ అందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు నారా కుటుంబం క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది” అని పేర్కొన్నారు. సొంత అన్న జగన్ తో షర్మిలకు చాలా కాలంగా పొసగడం లేదు. ముఖా ముఖాలు చూసుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఆమె లోకేష్ ను సోదరిగా భావించి క్రిస్మస్ బహుమతులు పంపడం.. దానికి లోకేష్ సానుకూలంగా స్పందించడం గమనార్హం.
వరుసగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ శ్రేణులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల మార్పు గందరగోళంలోకి నేడుతోంది. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియక అయోమయం నెలకొంది. సరిగ్గా ఎటువంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ తో ప్రత్యక్షం కావడం, చంద్రబాబుతో భేటీ జరగడంతో వైసీపీ శ్రేణులు ఒక రకమైన అలజడి నెలకొంది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా షర్మిల రంగంలోకి దిగడం ఆలోచనలో పడేస్తోంది. తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానం బలపడుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు పై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల ముంగిట ఎన్ని ట్విస్టులు చూడాలో అన్న ఆందోళన మాత్రం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.