YS Sharmila: పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు. వైసీపీని టార్గెట్ చేసుకుంటున్నారు. సోదరుడు జగన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ నేతలు ఒక్క మాట ఆడితే.. షర్మిల 10 మాటలతో తిప్పికొడుతున్నారు. విపక్షాల కంటే ఇప్పుడు షర్మిల ను ఎదుర్కోవడమే వైసీపీ శ్రేణులకు కష్టతరంగా మారింది. మున్ముందు ఆమె నుంచి మరింత ఇబ్బందులు తప్పవని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నామని.. కాంగ్రెస్ లోకి షర్మిల వెళ్లకుండా నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే షర్మిల ఇక్కడితో ఆగరని.. ఈ ఎన్నికల్లో జగన్ ను దెబ్బతీసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తారని అనుమానాలు ఉన్నాయి.
రానున్న ఎన్నికల్లో షర్మిల కడప జిల్లా నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె కడప ఎంపీ స్థానం నుంచి కానీ.. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి కానీ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో దెబ్బతిన్న ఆమె కాంగ్రెస్ లో చేరి అనుకున్నది సాధించుకోవాలని చూస్తున్నారు. దూకుడు రాజకీయాలు చేస్తే కానీ గుర్తింపు లభించదని ఒక అంచనాకు వచ్చారు. అందుకే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. సోదరుడు జగన్ పై యుద్ధం ప్రారంభించారు. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లను పెంచగలిగితే.. తనకు ఆ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని షర్మిల భావిస్తున్నారు. అందుకే సోదరుడు జగన్ పై పోటీ చేయాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారు.
గత రెండు ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన జగన్ ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. ఈసారి ఆయనపై పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఇద్దరి మధ్య గట్టి ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఒకవేళ షర్మిల పులివెందుల నుంచి పోటీ చేస్తే జగన్ తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల పోటీ చేస్తే జగన్ కు ఓటమి ఖాయమని.. సర్వేల్లో ఇదే వెల్లడైందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ప్రత్యేక సర్వే చేయించారని.. షర్మిల కే పులివెందులలో మొగ్గు కనిపిస్తోందని తేలినట్లు సమాచారం. అందుకే జగన్ కు వేరే నియోజకవర్గం ఎంచుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
జగన్ పులివెందుల నుంచి తప్పుకుంటే.. కమలాపురం నుంచి కానీ.. జమ్మలమడుగు నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కమలాపురం నుంచి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ నడుస్తోంది. ఒకవేళ షర్మిల పులివెందులలో పోటీ చేస్తే.. కుటుంబంలోనే మరొకరికి అక్కడ పోటీ పెట్టించి.. జగన్ తప్పుకుంటారని.. కమలాపురం నుంచి బరిలో దిగుతారని తెలుస్తోంది. మరోవైపు జమ్మలమడుగు నుంచి సైతం జగన్ పోటీ చేసే అవకాశమున్నట్లు టాక్ నడుస్తోంది. జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని.. కడప జిల్లాలో ఆ పార్టీ గెలిచే ఏకైక నియోజకవర్గం గా గుర్తింపు పొందింది. అక్కడ జగన్ బరిలో దిగి టీడీపీ ధీమాకు బ్రేక్ వేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇలా ఎలా చూసుకున్నా జగన్ పులివెందుల నుంచి దాటి వెళ్లిపోవడం సంచలనంగా మారనుంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. అందుకు ఎన్నికల వరకు ఆగాల్సి ఉంటుంది.