YS Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభవానికి కంకణం కట్టుకున్నారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటూనే సోదరుడు జగన్ తో జగడం తప్పదని బలమైన సంకేతాలు పంపారు. గట్టిగానే పోరాడుతానని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా కుటుంబంలో వివాదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే షర్మిల వ్యవహార శైలి ఉంది. ఇటీవల షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ హాజరయ్యారు. దీంతో కొంత రాజీ ధోరణి కనిపిస్తుందని వైసీపీ వర్గాలు భావించాయి. కానీ నిన్న బాధ్యతల స్వీకారంతో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. సంధి కాదు సమరమేనని తేల్చేశారు.
Also Read: షర్మిలకు అగ్నిపరీక్ష!
తెలంగాణలో పార్టీని స్థాపించిన షర్మిల.. ఎన్నడూ సోదరుడు జగన్ జోలికి రాలేదు. కానీ జగన్ వ్యతిరేక మీడియా గా గుర్తింపబడిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం కొత్త సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. అయితే ఆమె కెసిఆర్ సర్కార్ నుంచి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో సోదరుడి ఓదార్పు దక్కలేదు. అటు తెలంగాణ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో ఆమె రాణించకపోవడంతో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం, తరువాత అదే పార్టీలో తన పార్టీని విలీనం చేయడం, ఏపీ బాధ్యతలను తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామ క్రమంలో ఆమె వ్యవహార శైలి ఎలా ఉంటుందోనన్న అనుమానం అందరిలో ఉండేది. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ జగన్ పై ఆమె సమరభేరి మోగించడం విశేషం.
పీసీసీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పుట్టించాయి. ఏపీలో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక, మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దాచుకోవడం, దోచుకోవడమే కొనసాగుతోందని.. అభివృద్ధి అనేది లేదని విమర్శించారు. దళితులపై దాడులు 100కు 100 శాతం పెరిగాయని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. గత పది ఏళ్లలో ఏపీ అభివృద్ధి జరగలేదని… అప్పులు మాత్రం పది లక్షల కోట్లకు పెరిగాయని గుర్తు చేశారు. బిజెపి రైటిస్ట్ పార్టీ అని… అది అధికారంలో ఉంటే మణిపూర్ వంటి ఘటనలే జరుగుతాయని ఆక్షేపించారు. వైసిపి తో పాటు టిడిపి బిజెపి తొత్తులుగా మారాయని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు సర్కారును ప్రశ్నించిన జగన్ ఇప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. మొత్తానికైతే కీలక ఆరోపణలు చేయడం ద్వారా సోదరుడు జగన్ తో ఇక యుద్ధమేనని షర్మిల సంకేతాలు ఇచ్చారు. షర్మిల వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
Also Read: ఫ్యామిలీ పాలిట్రిక్స్: NTR, YSR కుటుంబ సభ్యులే ఏపీ 4 పార్టీల చీఫ్‌లు