Sharmila: రూటు మార్చిన షర్మిల.. జగన్ తో రాజీ.. ఇకపై చంద్రబాబుకు చుక్కలే

ఈ ఎన్నికల్లో జగన్ కు ఎక్కువ నష్టం కలిగించింది షర్మిల. జగన్ కోసం కృషి చేసిన తనను పట్టించుకోకపోవడంతో రివేంజ్ తీర్చుకోవాలని భావించింది. దానిని సద్వినియోగం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అంతిమంగా అది చంద్రబాబుకు లాభం చేకూర్చింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో షర్మిల ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : October 18, 2024 1:07 pm

YS Sharmila

Follow us on

Sharmila: పిసిసి అధ్యక్షురాలు షర్మిల దూకుడు పెంచారు.ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు సంకేతాలు పంపిస్తున్నారు.ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె పిసిసి అధ్యక్షురాలు అయ్యారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీ బలోపేతం కంటే జగన్ పతనాన్ని ఎక్కువ కోరుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవాలని భావించారు.అలానే జరిగింది.వైసిపి దారుణంగా ఓడిపోయింది. అయితే ఆ పార్టీ ఓటమి చవిచూసినా వైసీపీ పై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు సర్కార్ కు కొన్ని రోజులు సమయం ఇవ్వాలని భావించారు.సర్కార్ చేసిన కొంచెం మంచి పనులను సైతం ఆహ్వానించారు. అయితే చంద్రబాబుపై నేరుగా ఎప్పుడూ విమర్శలు చేయలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో సైతం అదే జాగ్రత్తలో ఉన్నారు. కానీ లడ్డు వివాదంలో పవన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో రాహుల్ పేరును బయటకు తీశారు పవన్.దీనిపై షర్మిల స్పందించారు. పవన్ తీరును తప్పు పట్టారు. రాహుల్ పై విమర్శలు తగవని హితవు పలికారు. అయితే ఇటీవల చంద్రబాబు సర్కార్ పై కూడా సునిశిత విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీంతో షర్మిల యూటర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా చంద్రబాబు సర్కార్ పై విమర్శలు ఎక్కువ పెడుతుండడంతో.. షర్మిల ఇకనుంచి జగన్ పై కంటే టిడిపి కూటమి సర్కార్ పై ఫోకస్ పెడతారన్న వార్తలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబుతో పాటు పవన్ జాతీయస్థాయిలో బిజెపికి బలమైన మద్దతు దారులుగా మారుతుండడంతో.. కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె ఇప్పుడు జగన్ పై కాకుండా.. చంద్రబాబు పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.

* సర్కారుపై కొత్త విమర్శలు
గత రెండు రోజులుగాచంద్రబాబు సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు షర్మిల. ఈరోజు ఏకంగా ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించడం విశేషం. ఈరోజు ఆమె విజయవాడ నుంచి తెనాలికి వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో తెనాలి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఒక్కసారిగా షర్మిల బస్సులో కనిపించడంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం షర్మిల బస్సు ప్రయాణ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* కచ్చితంగా అమలు చేయాల్సిందే
విజయవాడ నుంచి తెనాలి వెళ్లే బస్సులో ఎక్కిన షర్మిల మహిళా ప్రయాణికుల వద్ద కూర్చున్నారు. చంద్రబాబు సర్కార్ ఉచిత బస్సు ప్రయాణ హామీ గురించి ప్రస్తావించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు సర్కార్ అమలు చేయడం లేదని తప్పుపట్టారు. పొ రుగున ఉన్న రేవంత్ సర్కార్ అమలు చేస్తోందని.. మీరెందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఇదే విషయంపై అక్కడున్న మహిళా ప్రయాణికులకు సైతం పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సూచించారు షర్మిల. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా.. పాలసీల పేరుతో టైంపాస్ చేస్తున్నారంటూ షర్మిల నిన్ననే చంద్రబాబు సర్కార్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

* నిలదీతలు ప్రారంభం
అయితే బస్సు ప్రయాణం తర్వాత షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడ ప్రభుత్వాలు కొలువుదీరిన వెంటనే ఉచిత ప్రయాణాన్ని అమలు చేసిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. కానీ ఏపీలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళలు పై మీకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని నిలదీశారు. మొత్తానికైతే షర్మిల తీరులో మార్పు వస్తోంది. నిన్నటి వరకు జగన్ ను టార్గెట్ చేసుకున్న ఆమె ఇప్పుడు చంద్రబాబు పై విమర్శలు గుప్పిస్తుండడం విశేషం.