Jyothula Nehru: తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) అక్కడక్కడ అసంతృప్తులు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ ఎమ్మెల్యేలు నోరు తెరుస్తున్నారు. తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఈ తరుణంలో తూర్పుగోదావరి జిల్లా టిడిపి మినీ మహానాడులో ఆ పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జనసేనతో వస్తున్న సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా పార్టీ ముఖ్య నేత జ్యోతుల నెహ్రూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
* జనసేనకు అగ్ర తాంబూలం.. తూర్పుగోదావరి( East Godavari) జనసేనకు పట్టున్న జిల్లా. ఆపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా సైతం ఉన్నారు. అందుకే అక్కడ జనసేనకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. నామినేటెడ్ పదవుల్లో సైతం పెద్దపీట వేస్తున్నారు. జనసేనతో పోల్చుకుంటే టిడిపికి అక్కడ అవకాశాలు తగ్గాయి. దీనిని అక్కడ టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. వారు నేరుగా ఎమ్మెల్యేల వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు సైతం కలవరపాటుకు గురవుతున్నారు.
* మహానాడులో నెహ్రూ విశ్వరూపం..
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మహానాడు( mahanadu ) కాకినాడలో జరిగింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే తన మనసులో ఉన్న ఆవేదనను బయటపెట్టారు. కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించాలని సూచించారు. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ఇటీవల జనసేనకు చెందిన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకు రెండు పదవులు ఇచ్చారు. పేరు పెట్టకుండా దానిని ప్రస్తావిస్తూ ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా అని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాల వల్ల టిడిపి నిర్వీర్యం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఎన్నాళ్ళు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ వ్యాఖ్యానించారు. టిడిపి తో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే పరిస్థితి టిడిపికి రాకుండా చూడాలని జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. అయితే గత కొద్దిరోజులుగా జ్యోతుల నెహ్రూ పార్టీ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈ కామెంట్స్ చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి.
* జ్యోతుల నవీన్ సైతం..
ఇంకోవైపు కాకినాడ టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్( Jyo Tula Naveen ) చేసిన కామెంట్ సైతం సంచలనంగా మారాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి టిడిపి ఇన్చార్జ్ ప్రకటించక పోవడాన్ని తప్పుపట్టారు. ఆ నియోజకవర్గంలో జనసేనకు భారీ మెజారిటీ లభించడం వెనుక టిడిపి కార్యకర్తలు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యకర్తలను కాపాడుకో లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కూడా వ్యాఖ్యానించారు. అయితే జనసేన విషయంలో సలహాలు ఇస్తూనే టిడిపి నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తుండడం కూటమిలో విభేదాలకు కారణమవుతోంది.