AP Liquor Scandal: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక అరెస్టులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కూడా చేపడుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలుగా వ్యవహరించిన నాయకులతో పాటు అధికారులు కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్లో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్టు తరువాత.. ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు అందరి కళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాయి. మద్యం కుంభకోణంలో అక్రమంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్వయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో మాజీ ఎంపీ, ఒకప్పటి తన సహచరుడు విజయసాయిరెడ్డి పై సంచలన కామెంట్స్ చేశారు జగన్.
Also Read: “బియ్యం” మంత్రిగారి పదవికి ఎసరు పెట్టింది
* మద్యం పాలసీ పై చర్చ
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపితే లంచాలు ఎందుకు ఇస్తారు అంటూ ప్రశ్నించారు. అమ్మకాలు ఎక్కువగా ఉంటే లంచాలు ఇస్తారా? లాభాలు తగ్గితే ఇస్తారా అని ప్రశ్నించారు. 2018లో టిడిపి అధికారంలో ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఏడాది కాలంలో 3.84 కోట్ల మద్యం కేసుల అమ్మకాలు జరిగితే… 2.77 కోట్ల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయని జగన్ గుర్తు చేశారు. 2014 నుంచి 2019 మధ్య ప్రతి ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతూ వచ్చే అన్నారు. వీటి వల్ల మద్యం కంపెనీలకు లాభం పెరిగి చంద్రబాబుకు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు జగన్. అదే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గాయని.. పాము పెంచిన పనులే దానికి కారణమని.. మద్యం కంపెనీలకు ఆదాయం తగ్గి ప్రభుత్వానికి పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. మద్యం వినియోగం తగ్గడం వల్ల ప్రజా ఆరోగ్యానికి సైతం తాము మేలు చేశామని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి.
* ప్రజారోగ్యంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం
అయితే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) వాదన వింతలా ఉంది. మద్యం అమ్మకాలు తగ్గాయని చెబుతున్నారు.. వాటిపై పన్నులు విధించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అభియోగాలు మోపింది ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టారని కాదు. మద్యం కంపెనీల నుంచి భారీగా ముడుపులు తీసుకొని.. ప్రీమియం బ్రాండ్లను తొక్కిపెట్టి.. నాసిరకం మద్యం విక్రయాలు జరిపారన్నది ప్రధాన ఆరోపణ. మద్యం కంపెనీలతో పాటు డిస్టలరీల నుంచి కమీషన్లు దండుకున్నారు అన్నది అభియోగం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త లాజిక్ ప్లే చేస్తున్నారు. ప్రజారోగ్యం కోసమే అప్పట్లో మద్యం ధరలు పెంచామని.. పనులు పెంచి మద్యం షాపులపై భారం మోపిన విషయాన్ని చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మద్యం వ్యాపారం ప్రైవేట్ మాఫియా చేతుల్లో పెట్టిందని ఆరోపణలు చేస్తున్నారు.
* అమ్ముడుపోయిన సాయి రెడ్డి..
మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పై( Vijaya Sai Reddy) సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ మోహన్ రెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర ఏళ్ల పదవీకాలం వద్దనుకొని.. చంద్రబాబుకు మేలు చేసేందుకు పదవి వదులుకున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు. తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి.. తన పదవిని అమ్ముకున్న వ్యక్తి అని సంచలన ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తి లిక్కర్ స్కాంపై చేసే ఆరోపణలకు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు. అసలు రాజ్ కసిరెడ్డికి బేవరేజెస్ కార్యకలాపాలతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. లోక్సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఓ ఎస్ డి కృష్ణమోహన్, మల్టీ నేషనల్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప కు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. మొత్తానికి అయితే జగన్ అరెస్టు జరుగుతుందని భావిస్తున్న వేళ ఆయన మీడియా ముందుకు వచ్చి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.