TDP: టిడిపికి సీనియర్లు ఝలక్.. టికెట్ దక్కకపోతే జంప్

టిడిపి, జనసేన తొలి జాబితా విడుదల కానుంది. దాదాపు 100 సీట్లు వరకు ఆ రెండు పార్టీల మధ్య సర్దుబాటు పూర్తయింది. బిజెపి లెక్క తేలనుంది. ప్రస్తుతానికి 15 అసెంబ్లీ స్థానాలను జనసేనకు కేటాయిస్తూ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : February 24, 2024 9:40 am
Follow us on

TDP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. నేతల జంపింగులు ప్రారంభమయ్యాయి. టికెట్లు దక్కని వారు పక్క పార్టీలో చేరుతున్నారు. వైసిపి పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడంతో.. టిక్కెట్లు దక్కని వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజాగా టిడిపి, జనసేన తొలి జాబితాను విడుదల చేయనుండడంతో ఆ రెండు పార్టీల్లో సైతం అసంతృప్తులు బయటకు రానున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. ఎంపీలు బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు ఆ పార్టీకి దూరమయ్యారు. వసంత కృష్ణ ప్రసాద్, కొలుసు పార్థసారథి వంటి ఎమ్మెల్యేలు, వంశీకృష్ణ శ్రీనివాస్, జంగా కృష్ణమూర్తి వంటి ఎమ్మెల్సీలు సైతం పార్టీని వీడారు. కొందరు ఇప్పటికే వేరే పార్టీల్లో చేరారు.

టిడిపి, జనసేన తొలి జాబితా విడుదల కానుంది. దాదాపు 100 సీట్లు వరకు ఆ రెండు పార్టీల మధ్య సర్దుబాటు పూర్తయింది. బిజెపి లెక్క తేలనుంది. ప్రస్తుతానికి 15 అసెంబ్లీ స్థానాలను జనసేనకు కేటాయిస్తూ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు టిడిపి దాదాపు 40 అసెంబ్లీ స్థానాలను కేటాయించాల్సి ఉంది. ఇలా ఇస్తున్న నియోజకవర్గాల టిడిపి నేతలతో చంద్రబాబు ఇప్పటికే మాట్లాడారు. అయితే జాబితా వెల్లడయిన తర్వాత ఒకరిద్దరు సీనియర్లు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. టిడిపి వ్యవస్థాపక సభ్యుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయనకు కాదని జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు టికెట్ కేటాయిస్తారన్న ప్రచారం నేపథ్యంలో.. బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఉభయగోదావరి, విశాఖ జిల్లాలో ఎక్కువగా పొత్తులో భాగంగా టిడిపి సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. అందులో కొన్ని సిట్టింగ్ స్థానాలు కూడా ఉన్నాయి. గతంలో సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు అని చంద్రబాబు ప్రకటించారు. కానీ పొత్తులో భాగంగా సిట్టింగ్ స్థానాలు సైతం వదులుకోవాల్సి ఉంటుంది. విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఈసారి భీమిలి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. కానీ హై కమాండ్ మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని సూచిస్తోంది. తనకు విశాఖ జిల్లాలోని సర్దుబాటు చేయాలని గంటా పట్టు పడుతున్నారు. దీంతో హై కమాండ్ కు దిక్కుతోచడం లేదు.

జనసేన ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం కోరుతున్నట్లు తెలుస్తోంది. అటు బిజెపికి సైతం 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించాల్సి ఉంది. ఆ పార్టీ సైతం అన్ని ప్రాంతాల్లో ప్రాతినిధ్యం కోరుతున్నట్లు సమాచారం. అదే జరిగితే కొందరు టిడిపి సీనియర్లకు టికెట్లు లేనట్టే. వారి నుంచి ప్రతికూలత ఎదురైతే పొత్తు లక్ష్యం దెబ్బతింటుంది. అందుకే చంద్రబాబు వడపోస్తున్నారు. పొత్తులో భాగంగా అలకలు, అసంతృప్తులకు తావు లేకుండా బుజ్జగింపుల పర్వానికి ఒక కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. అయితే ఎలా చూసుకున్నా తొలి జాబితా ఈరోజు వెల్లడి కానుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.