AP Real Estate : ఏపీ ప్రజలకు శుభవార్త. భూ క్రయ విక్రయాలకు సంబంధించి, ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఎనీవేర్ రిజిస్ట్రేష్ పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది. అటు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను సైతం ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా కొన్ని సచివాలయాలను ఎంపిక చేసింది. వర్కవుట్ కావడంతో మిగతా సచివాలయాలకు విస్తరించే పనిలో పడింది. తాజాగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను రూపకల్పన చేసింది.
ప్రభుత్వానికి ఆదాయ వనరుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియే ప్రధానమైనది. రాష్ట్ర ఆదాయంలో సింహభాగం ఆ శాఖ నుంచే సమకూరుతోంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ శాఖలో నెలకొన్న లోపాలు ప్రభుత్వానికి శాపంగా మారాయి. అనుకున్న స్థాయిలో ఆదాయం సమకూరడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముందుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యాన్ని నియంత్రిస్తే సమస్యను అధిగమించవచ్చని ప్రభుత్వం గుర్తించింది.తమ ఆస్తులు ఎక్కడున్నా సరే తాము నివసిస్తున్న ప్రాంతాల నుంచే వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పించారు. గతంలో సదరు ఆస్తుల పత్రాలను వినియోగదారులు తాము దరఖాస్తు చేసుకున్న ప్రాంతం నుంచి స్ధానిక రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పంపి పరిశీలించి ఆమోద ముద్ర వేసేవారు. దీంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. అందుకే సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తెరపైకి తెచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రయవిక్రయదారులకు మరింత సులభతరంగా మార్చారు ఎనీవేర్ కింద వచ్చిన దరఖాస్తుల్ని సదరు రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఆ ఆస్తి ఉన్న ప్రాంత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతానికి చెందిన ఆస్తిగా ఆన్ లైన్లో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడి నుంచే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం ఉన్న ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో భాగంగా ఎక్కడో ఉన్న ఆస్తికి ఇక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మనం దరఖాస్తు చేసుకుంటే సదరు ఆస్తిని పరిశీలించేందుకు అక్కడి సబ్ రిజిస్ట్రార్ కు పంపుతున్నారు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. సిబ్బందికి పనిభారం తప్పడం లేదు. అందుకే కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.