https://oktelugu.com/

New York: మునిగిపోతున్న న్యూయార్క్‌.. త్వరలో సముద్ర గర్భంలోకి..!

యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్, జియాలజిస్ట్‌ టామ్‌ పార్సన్స్‌ మాట్లాడుతూ ‘న్యూయార్క్‌ నగరం ప్రతి సంవత్సరం వరదల సవాళ్లను ఎదుర్కుంటోందని తెలిపారు. తూర్పు అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి అట్లాంటిక్‌ తీరంలో ఉంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 20, 2023 / 04:05 PM IST

    New York

    Follow us on

    New York: న్యూయార్క్‌.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం.. ఎత్తయిన ఆకాశహర్మాయాలకు నిలయం. కాంక్రీటు జంగల్‌గా మారిన ఖరీదైన నగరం త్వరలో సముద్రరగ్భంలో కలిసిపోనుందా అంటే అవుననే అంటున్నారు జియాలజిస్టులు. భారీ నిర్మాణాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆ నగరాన్ని ఇప్పుడు అవే ముంచబోతున్నాయని పేర్కొంటున్నారు. కొన్నేళ్లుగా నగరం ఏటా 2 మిల్లీ మీటర్లు కుంగిపోతోందని తాజా నివేదికలో పేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నగరం సముద్రంలో మునిగిపోవడం ఖాయమని నివేదికలో తెలిపారు. ముఖ్యంగా సముద్రం పక్కనే ఉన్న భవనాలు ముందుగా మునిగిపోతాయని నివేదికలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ నివేదిక న్యూయార్క్‌ వాసులను భయపెడుతోంది.

    అధిక భారంతో తల్లడిల్లుతున్న భూమి..
    న్యూయార్క్‌ నగరంలో భూమి అధిక బరువుతో తల్లడిల్లుతోంది. అక్కడి నిర్మాణాలను భూమాత మోయలేకపోతోంది. దీంతో భూమి పొరల్లో మార్పులు జరుగుతున్నాయి. ఫలితంగా ఏడాదికి 2 మిల్లీ మీటర్ల చొప్పున కుంగిపోతోంది. శాటిలైట్‌ చిత్రాల్ని పోల్చి చూసినప్పుడు ఈ తేడా తెలుస్తోంది. దిగువన ఉండే మాన్‌హాటన్‌∙వంటి ప్రాంతాలు చాలా త్వరగా క్షీణిస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. బ్రూక్లిన్, క్వీన్స్‌ ప్రాంతాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. న్యూయార్క్‌ పోస్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం, న్యూయార్క్‌లోని 10 లక్షల భవనాల బరువు 1.7 ట్రిలియన్‌ పౌండ్లు. యూనివర్స్శిటీ ఆఫ్‌ రోడ్‌ ఐలాండ్‌లోని యుఎస్‌ జియోలాజికల్‌ సర్వే, జియాలజిస్టులు కలిసి.. ఈ లెక్కలు వేశారు.

    ఏటా వరదలు..
    యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్, జియాలజిస్ట్‌ టామ్‌ పార్సన్స్‌ మాట్లాడుతూ ‘న్యూయార్క్‌ నగరం ప్రతి సంవత్సరం వరదల సవాళ్లను ఎదుర్కుంటోందని తెలిపారు. తూర్పు అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి అట్లాంటిక్‌ తీరంలో ఉంది. ఇక్కడ అట్లాంటిక్‌ సముద్ర మట్టం ప్రపంచ సగటు కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ ఉంది అని తెలిపారు. పెరుగుతున్న వరద ప్రమాదాలు, పెరుగుతున్న సముద్ర మట్టాలను ఎదుర్కోవటానికి కొత్త వ్యూహాల్ని అభివృద్ధి చేయాలని రిపోర్టును రాసిన ప్రధాన శాస్త్రవేత్త చెప్పారు. భవిష్యత్తులో న్యూయార్క్‌ను ఎలా కాపాడుకోవాలనే దానిపై కొత్త వ్యూహాన్ని రూపొందించాలని కోరారు. (ప్రతీకాత్మక చిత్రం)

    భవనాలే భారం..
    సైన్స్‌ అలర్ట్‌ ప్రకారం పరిశోధకుల బృందం… న్యూయార్క్‌ నగరంలో 10 లక్షల కంటే ఎక్కువ భవనాల బరువును లెక్కించింది. ఇది 7,64,00,00,00,000 కేజీలు లేదా 1.68 ట్రిలియన్‌ పౌండ్లకు సమానం. నగరాన్ని 100 మీటర్ల చదరపు గ్రిడ్లుగా విభజించారు. భవనాల గురుత్వాకర్షణ, ఒత్తిడిని అధ్యయనం చేశారు. ఇంత భారీ బరువు కారణంగా న్యూయార్క్‌ నగరం కుప్పకూలే ప్రమాదం ఉందని అంచనా వేశారు.

    భూగర్భ జలాల క్షీణత..
    న్యూయార్క్‌ నగరంలో భూగర్భ జలాల వెలికితీత, పంపింగ్, పెరుగుతున్న పట్టణీకరణ వంటివి ఈ నగరానికి శాపం కానున్నాయని పరిశోధకులు అంచనా వేశారు. ఐతే… పరిశోధకులు భవనాలపై దృష్టి పెట్టారు గానీ… రోడ్లు, కాలిబాటలు, వంతెనలు, రైల్వేలు, ఇతర చదునుగా ఉన్న ప్రాంతాల్ని లెక్కలోకి తీసుకోలేదు.

    మానవ తప్పిదమే..
    న్యూయార్క్‌ ఈ పరిస్థితి ఎదుర్కొవడానికి మానవ తప్పిదమే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్న నిర్మాణాలు, ఇష్టానుసారంగా తవ్వకాలు, పచ్చదనం లేకపోవడం, భూగర్భ జలాలు తోడడం వంటి కారణాలతో భూమి పొరల్లో ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే న్యూయార్క్‌ సముద్రగర్భంలో కలిసిపోవడం ఖాయమంటున్నారు.